Neeraj Sharma: అమెరికా పౌరసత్వం కోల్పోనున్న నీరజ్ శర్మ ఎవరు? బయటపడ్డ వీసా స్కామ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో అక్రమ మార్గాల్లో పౌరసత్వం పొందిన వారిపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. తప్పుడు సమాచారం, మోసపూరిత పద్ధతుల ద్వారా అమెరికా పౌరసత్వం సంపాదించిన 17 మందిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ న్యాయపరమైన ప్రక్రియ ప్రారంభించింది. ఈ జాబితాలో భారతీయ సంతతికి చెందిన న్యూజెర్సీ వ్యాపారవేత్త, మాజీ సీఈఓ నీరజ్ శర్మ (50) ఉండటం చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
హెచ్-1బీ వీసాల పేరుతో మోసం
భారత్‌లో జన్మించిన నీరజ్ శర్మ 'మాగ్నానివిజన్ ఎల్‌ఎల్‌సీ' అనే ఐటీ స్టాఫింగ్ సంస్థను నిర్వహించేవారు. విదేశీ ఉద్యోగుల కోసం హెచ్-1బీ వీసా దరఖాస్తులను దాఖలు చేసే క్రమంలో.. ఒక ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తప్పుడు వివరాలు సమర్పించినట్లు అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో 11 నకిలీ హెచ్-1బీ వీసా పిటిషన్లు దాఖలు చేసినట్లు విచారణలో తేలింది. అంతేకాదు.. సంబంధిత సంస్థ ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ పత్రాలను తయారు చేసినట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఈ అక్రమాలు 2015 నుంచి 2017 మధ్య కాలంలో జరిగినట్లు గుర్తించారు.
వివరాలు
పౌరసత్వ దరఖాస్తులోనూ తప్పుడు సమాచారం
నీరజ్ శర్మ 2017 డిసెంబర్‌లో అమెరికా పౌరసత్వం పొందారు. అయితే పౌరసత్వ దరఖాస్తు సమయంలో తాను ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, ప్రభుత్వ అధికారులకు తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వలేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కానీ తర్వాత వెలుగులోకి వచ్చిన వీసా మోసం కేసులో ఆయన దోషిగా తేలడంతో పరిస్థితి మారింది. తాజా కోర్టు పత్రాల ప్రకారం.. తనపై ఉన్న నేరపూరిత కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి పౌరసత్వం పొందారని అమెరికా న్యాయశాఖ వాదిస్తోంది. అందుకే మోసపూరిత సమాచారంతో పొందిన అమెరికా పౌరసత్వాన్ని చట్టబద్ధంగా రద్దు చేయాలని ప్రభుత్వం కోర్టును కోరుతోంది.
వివరాలు
ట్రంప్ సర్కార్ లక్ష్యంగా 17 మంది
అమెరికా ప్రభుత్వం వలస మోసాలకే కాకుండా తీవ్ర నేరాలకు పాల్పడి పౌరసత్వం పొందిన వారిపైనా దృష్టి సారించింది. పౌరసత్వం రద్దు జాబితాలో ఉన్న 17 మందిలో చిన్నారులపై లైంగిక దాడులు, మనీలాండరింగ్, వైర్ ఫ్రాడ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాల్లో పాల్గొన్న వ్యక్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ జాబితాలో హైతీకి చెందిన ఓ వలసదారుడు, కొలంబియాకు చెందిన మాజీ క్యాథలిక్ ప్రీస్ట్, మెక్సికోకు చెందిన వ్యక్తి, మాజీ యుగోస్లావియా పౌరుడు సహా పలువురు ఉన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేస్తూ అక్రమంగా పొందిన అమెరికా పౌరసత్వాలను రద్దు చేసే ప్రక్రియను ట్రంప్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది.