Manivannan: స్టూడెంట్ వీసాతో స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యురాలిగా గెలిచిన భారత సంతతి ట్రాన్స్‌జెండర్ నేత మణివన్నన్ ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
భారత సంతతికి చెందిన క్యూ. మణివన్నన్ స్కాట్లాండ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. 2021లో స్టూడెంట్ వీసాతో స్కాట్లాండ్‌కు వెళ్లిన ఆమె ఇప్పుడు స్కాటిష్ పార్లమెంట్ సభ్యురాలిగా (ఎంఎస్పీ) ఎన్నికయ్యారు. ఎడిన్‌బర్గ్ అండ్ లోథియన్స్ ఈస్ట్ ప్రాంతీయ జాబితా స్థానంలో స్కాటిష్ గ్రీన్స్ పార్టీ తరఫున గెలుపొందారు. క్యూమణివన్నన్ తనను తాను నాన్-బైనరీగా గుర్తించుకుంటూ 'దే/దెమ్' ప్రోనౌన్స్ ఉపయోగిస్తుంటారు. శాశ్వత నివాస హక్కు లేకపోయినా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మరోవైపు సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ కూడా జరుగుతోంది. అయినప్పటికీ వైవిధ్యానికి ఇది గెలుపు అని మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
మానవ శాస్త్రవేత్త, కవయిత్రిగా గుర్తింపు పొందిన క్యూ.మణివన్నన్
స్కాటిష్ గ్రీన్స్ పార్టీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "ఈరోజు ఎడిన్‌బర్గ్ & లోథియన్స్ ఈస్ట్ నుంచి ఎన్నికైన నలుగురు గ్రీన్ ఎంఎస్పీల్లో మణివన్నన్ ఒకరు. దీంతో స్కాట్లాండ్‌లో మా మొత్తం సభ్యుల సంఖ్య ఏడుకు చేరింది" అని పేర్కొంది. మణివన్నన్ తనను "క్వియర్ తమిళ వలసదారుడు"గా పేర్కొంటారు. అంతర్జాతీయ సంబంధాలపై చదువుకోడానికి 2021లో స్కాట్లాండ్‌లోని సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ఆమె మానవ శాస్త్రవేత్త, కవయిత్రిగా కూడా గుర్తింపు పొందారు. వలసలు, వ్యక్తిత్వం, క్వియర్ హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై తరచూ మాట్లాడుతుంటారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మణివన్నన్ భావోద్వేగంగా స్పందించారు.
వివరాలు
స్టూడెంట్ వీసాపై క్యూ.మణివన్నన్
"నేను డాక్టర్ క్యూ.మణివన్నన్. ట్రాన్స్‌జెండర్ తమిళ వలసదారిని. ఈ దేశంలో ద్వేష భావాలు కలిగిన వారు అసహ్యించుకునే ప్రతి గుర్తింపూ నాలో ఉంది.అయినప్పటికీ ఇప్పుడు మీ ఎంఎస్పీగా మీ ముందున్నాను" అని పేర్కొన్నారు. క్యూమణివన్నన్ విజయం స్కాట్లాండ్ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది. ఎందుకంటే ఆమెకు యూకేలో శాశ్వత నివాస అనుమతి లేదు. ప్రస్తుతం స్టూడెంట్ వీసాపైనే అక్కడ ఉన్నారు. అయితే 2020లో అమల్లోకి వచ్చిన 'స్కాటిష్ ఎలక్షన్స్(ఫ్రాంచైజ్ అండ్ రిప్రజెంటేషన్)చట్టం' వల్ల తాత్కాలిక వీసాలు కలిగినవారికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించింది. ఈ చట్టం రాకముందు యూకేలో శాశ్వత నివాస హక్కు తప్పనిసరి అయ్యేది.ఇప్పుడు స్టడీ వీసా వంటి చెల్లుబాటు అయ్యే వీసా ఉన్నవారు కూడా పోటీ చేయవచ్చు.
వివరాలు
కొత్త వీసా పొందడం వీరికి చాల సులభం
బీబీసీ కథనం ప్రకారం పార్లమెంట్ పదవీకాలంలోనే క్యూమణివన్నన్ తన స్టూడెంట్ వీసాను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు చదువు పూర్తయ్యాక యూకేలో ఉండేందుకు ఉపయోగపడే గ్రాడ్యుయేట్ వీసా కోసం ఆర్థిక సహాయం కూడా కోరినట్లు 'ది టెలిగ్రాఫ్' వెల్లడించింది. ఏడాదికి 80 వేల పౌండ్లలోపు జీతం ఉన్న వారికి కొత్త వీసా పొందడం సులభమవుతుందని బీబీసీ స్కాట్లాండ్ పేర్కొంది.