
Reshma Kewalramani: టైమ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నభారత సంతతి బయోటెక్ మార్గదర్శకురాలు రేష్మా కేవల్‌రమణి ఎవరు..?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే 'టైమ్ మ్యాగజైన్' 2025 సంవత్సరానికి సంబంధించి ప్రభావవంతమైన వందమంది వ్యక్తుల జాబితాను ఇటీవల విడుదల చేసింది.
ఈసారి భారతీయులెవరూ ఈ ప్రతిష్టాత్మక లిస్టులో చోటు దక్కించుకోలేకపోయినా, భారత మూలాలు కలిగిన ఒక మహిళ ఆ ఖాళీని పూరించారు.
ఆమెనే అమెరికాలోని బయోటెక్ రంగంలో అగ్రగామిగా ఎదిగిన కేవల్ రమణి.
అమెరికన్ పౌరురాలుగా ఉన్నప్పటికీ,ఆమెకు భారతీయ మూలాలు ఉన్నాయి.
2020 కాలంలో కూడా రేష్మా కేవల్‌రమణి వార్తల్లో నిలిచారు.అప్పట్లో యునైటెడ్ స్టేట్స్‌లో ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థకు సీఈవోగా నియమితులైన తొలి మహిళగా గుర్తింపు పొందారు.
ఆమె నేతృత్వంలోని సంస్థ "వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్",అమెరికాలో ప్రధానమైన బయోటెక్ కంపెనీగా నిలుస్తోంది.
వివరాలు
జన్యు సంబంధిత వైద్య ఆవిష్కరణలు
ఆ కంపెనీకి సీఈవోగా ఆమె కొనసాగుతున్నారు. టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఆమెను 2025లో ఆ వందమందిలో ఒకరుగా గుర్తించారు.
ఇదే కాదు.. ఈసారి ఆ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారత మూలాలు కలిగిన వ్యక్తిగా ఆమె నిలిచారు.
ఆమె కంపెనీలో చేసిన జన్యు సంబంధిత వైద్య ఆవిష్కరణలు ప్రత్యేకంగా గుర్తింపు పొందాయి.
ముఖ్యంగా ఆమె నాయకత్వంలో వెర్టెక్స్ సంస్థ అభివృద్ధి చేసిన మొట్టమొదటి CRISPR-ఆధారిత చికిత్సకు అమెరికన్ ఎఫ్‌డిఏ (FDA) అనుమతి ఇచ్చింది.
ఇది సంస్థకు విశేషమైన పురోగతిని తీసుకురావడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా శ్రద్ధ ఆకర్షించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వివరాలు
క్రిస్పర్ టెక్నాలజీ ఆధారిత చికిత్స.. "సికిల్ సెల్" అనే జన్యు వ్యాధికి సరైన పరిష్కారం
ఈ క్రిస్పర్ టెక్నాలజీ ఆధారిత చికిత్స ప్రధానంగా "సికిల్ సెల్" అనే జన్యు వ్యాధికి సరైన పరిష్కారం కావడం గమనార్హం.
ఈ చికిత్స, ఆ వ్యాధికి కారణమైన DNA లో ఉన్న మ్యూటేషన్‌లను సరిదిద్దే విధంగా పనిచేస్తుంది.
టైమ్ మ్యాగజైన్ ఆమెను అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చేర్చినప్పుడు, ఈ అంశాన్ని ముఖ్యంగా ప్రస్తావించింది.
ఇక, జింగో బయోవర్క్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు జాసన్ కెల్లీ - రేష్మా దూరదృష్టిని ప్రశంసిస్తూ, డీఎన్ఏ అనే భాషతోనే మన శరీరం మాట్లాడుతుందని, భవిష్యత్తులో మందులు కూడా అదే భాషలో ప్రతిస్పందిస్తాయని వ్యాఖ్యానించారు.
ఈ కొత్త తరహా ఔషధాలు మరిన్ని వ్యాధులను నివారించేలా మారతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
వివరాలు
రేష్మా విద్యా నేపథ్యం..
రేష్మా ముంబైలో జన్మించారు. 1988లో ఆమె అమెరికా వెళ్ళిన తరువాత, అక్కడే వైద్య విద్యను కొనసాగించారు.
బోస్టన్ యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీని పూర్తి చేసి, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో ఫెలోషిప్ పొందారు.
అనంతరం, 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో జనరల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేశారు.
2017లో వెర్టెక్స్ సంస్థలో చేరిన ఆమె, తన ప్రతిభతో చాలా త్వరగా ఎదిగారు.
2018లో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి, కేవలం రెండేళ్లలోనే సంస్థ సీఈవోగా నియమితులయ్యారు.
ఆమె ప్రస్థానం, అంకితభావం, విజన్ అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.