
TIME's Most Influential People:టైమ్స్ అత్యంత ప్రభావవంతమైన నాయకుల జాబితాలోట్రంప్,యూనస్ లకు అగ్రస్థానం.. భారతీయులకు దక్కని చోటు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికి గానూ తన "మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్" జాబితాను విడుదల చేసింది.
మొత్తం 100 మంది ప్రముఖులతో కూడిన ఈ జాబితాలో ఈసారి భారతీయులకు మాత్రం చోటు దక్కకపోవడం విశేషంగా నిలిచింది.
ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత,నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్,అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు ఉన్నారు.
అంతేకాదు, ప్రముఖ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, ప్రముఖ గాయకుడు ఈద్ షరీన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పేరు పొందిన డెమిస్ హస్సాబిస్ వంటి వారు కూడా ఇందులో చోటు దక్కించుకున్నారు.
వివరాలు
భారతీయులకి స్థానం దక్కకపోవడం ఇదే తొలిసారి
ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. ఈ ఏడాది జాబితాలో భారతదేశం నుంచి ఏ ఒక్కరు కూడా స్థానం పొందలేదు.
గతంలో షారూఖ్ ఖాన్, అలియా భట్, రెజ్లర్ సాక్షి మాలిక్ వంటి భారతీయులు ఈ జాబితాలో నిలిచిన సంగతి తెలిసిందే.
అయితే ఇటీవలి కాలంలో భారతీయులకి స్థానం దక్కకపోవడం ఇదే తొలిసారి.
అయినప్పటికీ, భారత సంతతికి చెందిన రేష్మా కేవలరమణి ఈ జాబితాలో చోటు సంపాదించారు.
ఆమె వర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ముంబయిలో జన్మించిన రేష్మా, 11 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
వివరాలు
టైమ్ జాబితాకు ప్రాధాన్యత ఎందుకు?
టైమ్ మ్యాగజైన్ ఎందుకు ప్రాముఖ్యత పొందింది అన్నదానికి విశేషమైన నేపథ్యం ఉంది.
ఇది 1923 మార్చి 3న న్యూయార్క్‌లో స్థాపించబడింది. హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ కలిసి ప్రారంభించిన ఈ పత్రిక, సమకాలీన వార్తలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగింది.
కాలక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. వివిధ రంగాలలో ప్రభావం చూపిన ప్రముఖుల జాబితాను ఈ మ్యాగజైన్ ప్రతి ఏడాది విడుదల చేస్తూ వస్తోంది.
టైమ్ మొదటిసారి ప్రభావశీల వ్యక్తుల జాబితాను 1999లో విడుదల చేసింది.అప్పటి నుంచే మేధావులు,రాజకీయ నాయకులు,జర్నలిస్టుల మధ్య ఈ జాబితా చర్చనీయాంశంగా మారింది.
అయితే 2004 నుండి ప్రతి ఏడాదూ నిరంతరంగా ఈ జాబితా విడుదల చేస్తూ వస్తోంది.ఈ జాబితాలో చోటు దక్కడం అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినట్టే.