Page Loader
హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు  డబ్ల్యూహెచ్ఓ ఆమోదం
'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ప్రీక్వాలిఫికేషన్ గుర్తింపు

హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం

వ్రాసిన వారు Stalin
Dec 28, 2022
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫార్మా దిగ్గజం హెటిరో మరో మైలు రాయిని అధిగమించింది. ఆ సంస్థ తయారు చేసిన కరోనా ఔషధం 'నిర్మాకామ్' ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) ప్రీక్వాలిఫికేషన్ గుర్తింపు లభించింది. కరోనా రోగులకు అందించే.. ఫైజర్‌కు చెందిన పాక్స్‌లోవిడ్‌ ఔషధానికి 'నిర్మాకామ్' అనేది జెనరిక్‌ ఔషధం. పాక్స్‌లోవిడ్‌లో నిర్మాట్రెల్‌విర్‌, రిటొనవిర్‌ ట్యాబ్లెట్లు కలిపి ప్యాక్ చేసి ఉంటాయి. 'నిర్మాకామ్'లో అవే కాంబినేషన్‌లోని ఔషధాలు ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభించినందు వల్ల దాదాపు 95అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో నిర్మాకామ్'ను అమ్మడానికి వీలవుతుంది. 'నిర్మాకామ్' ఔషధం వినియోగంపై డబ్ల్యూహెచ్ఓ స్పష్టమైన మార్గనిర్దేశకాలు జారీ చేసింది. స్వల్పస్థాయి నుంచి మధ్యస్థాయి వరకు కోవిడ్‌తో బాధపడుతున్న వారికి ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని డబ్ల్యూహెచ్ఓ సిఫారసు చేసింది.

హెటిరో

ప్యాకెట్ విలువ రూ.4,900

చైనాతో ప్రపంచ దేశాల్లో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వైరస్ తీవ్రతను తగ్గించడానికి డబ్ల్యూహెచ్ఓ తాజా నిర్ణయం దోహదపడుతుందని హెటిరో ఎండీ వంశీకృష్ణ చెప్పారు. ఫైజర్‌ ఔషధానికి జెనరిక్‌ వెర్షన్ అయిన నిర్మాకామ్‌ను తయారు చేసి అమ్మడానికి మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌ (ఎంపీపీ)తో హెటిరో నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ వాలంటరీ లైసెన్స్‌ ఒప్పందం చేసుకుంది. నిర్మాకామ్‌ ఔషధానికి ఇప్పటికే డీసీజీఐ అనుమతి కూడా లభించింది. 150 ఎంజీ నిర్మాట్రెల్‌విర్‌ టాబ్లెట్లు రోజుకు రెండు సార్లు రెండు చొప్పున, 100 ఎంజీ రిటొనవిర్‌ రోజుకు రెండు సార్లు ఒకటి చొప్పున 5 రోజులు వాడాలని హెటిరో తెలిపింది. దీని ప్యాకెట్ విలువ రూ.4,900 అని వెల్లడించింది.