LOADING...
El Mencho: పోలీసు ఉద్యోగి నుంచి డ్రగ్ కింగ్‌పిన్ వరకు.. 'ఎల్‌ మెంచో'ది రక్త చరిత్రే..!
పోలీసు ఉద్యోగి నుంచి డ్రగ్ కింగ్‌పిన్ వరకు.. 'ఎల్‌ మెంచో'ది రక్త చరిత్రే..!

El Mencho: పోలీసు ఉద్యోగి నుంచి డ్రగ్ కింగ్‌పిన్ వరకు.. 'ఎల్‌ మెంచో'ది రక్త చరిత్రే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెక్సికోలో డ్రగ్‌ ప్రపంచాన్ని కుదిపేసిన కింగ్‌పిన్‌ 'ఎల్‌ మెంచో' మృతితో దేశం మొత్తం ఉద్రిక్తంగా మారింది. తమ నాయకుడి మరణాన్ని సహించలేక అతడి అనుచరులు ఆగ్రహంతో హింసాత్మక చర్యలకు దిగారు. పలు ప్రాంతాల్లో దుకాణాలకు నిప్పంటించడం, వాహనాలను తగలబెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకుని పరిస్థితి అదుపుతప్పింది. దీంతో మెక్సికోలో అల్లర్లు చెలరేగాయి. అసలు ఈ 'El Mencho' ఎవరు? అతడి నేపథ్యం ఏమిటి?

వివరాలు 

పోలీసు ఉద్యోగం నుంచి డ్రగ్‌ దందాకు..

'ఎల్‌ మెంచో' అసలు పేరు నెమెసియో ఒసెగుయెరా సెర్వాంటెస్‌. 1966లో మెక్సికోలోని మిచోకాన్‌ రాష్ట్రంలోని ఓ దూర ప్రాంత గ్రామంలో జన్మించాడు. ఆ ప్రాంతం అవకాడో సాగుకు ప్రసిద్ధి చెందడంతో పాటు గంజాయి, నల్లమందు పంటలకూ పేరొందింది. చిన్నతనంలో అవకాడో తోటల్లో కూలిగా పనిచేసిన అతడు, 1980లలో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాడు. కాలిఫోర్నియాలో హెరాయిన్‌ సరఫరా చేస్తూ అమెరికా అధికారులకు చిక్కాడు. కొన్ని సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించిన తరువాత అమెరికా ప్రభుత్వం అతడిని తిరిగి మెక్సికోకు పంపించింది. స్వదేశానికి వచ్చిన అనంతరం కొంతకాలం పోలీసు విభాగంలో పనిచేశాడు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయాల ద్వారానే మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారంలోకి ప్రవేశించాడు.

వివరాలు 

రక్తపాతం నడుమ నేర సామ్రాజ్యం

మొదట మెక్సికోలో బలమైన డ్రగ్‌ ముఠాగా పేరుగాంచిన Sinaloa Cartel తో అనుబంధం కలిగిన గుంపులో పనిచేశాడు. అనంతరం 2009లో స్వతంత్రంగా Jalisco New Generation Cartel (జాలిస్కో న్యూజనరేషన్‌ కార్టెల్‌) ను స్థాపించాడు. ఈ సంస్థ గత కొన్నేళ్లుగా అమెరికాకు ఫెంటనిల్‌ వంటి అత్యంత ప్రమాదకర మాదకద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేస్తోంది. డ్రగ్‌ రవాణాతో పాటు దోపిడీలు, అపహరణలు, హత్యలు వంటి అనేక నేరాల్లో ఈ ముఠా పాలుపంచుకుంది. 2015లో కేవలం ఆరు వారాల్లోనే 20 మందికి పైగా పోలీసులను తలలు నరికి దారుణంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Advertisement

వివరాలు 

కన్పించకుండానే భయపెడుతూ..

ప్రఖ్యాత డ్రగ్‌ డాన్‌ El Chapo తరువాత మెక్సికోలో అత్యంత శక్తివంతమైన నేరగాడిగా ఎల్‌ మెంచో ఎదిగాడు. అయితే చాపోలా మీడియా ముందుకు రాకుండా, గోప్యంగా ఉండి తన ప్రభావాన్ని విస్తరించాడు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో దాక్కొని కార్యకలాపాలు నిర్వహించేవాడు. గతంలో అతడిని పట్టుకునేందుకు మెక్సికో భద్రతా బలగాలు రెండు సార్లు ప్రయత్నించినప్పటికీ, చివరి క్షణంలో తప్పించుకున్నాడు. సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు విడుదల చేసి అధికారులను, ప్రత్యర్థులను హెచ్చరించేవాడు. రాజకీయ స్థాయిలోనూ అతడికి మద్దతు ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కుటుంబ సభ్యులూ అతడి కార్యకలాపాల్లో భాగమయ్యారు. అతడి భార్య రోజాలిండా వాలెన్సియా కార్టెల్‌ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించగా, కుమారుడు అమెరికాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో జీవితఖైదు అనుభవిస్తున్నాడు.

Advertisement

వివరాలు 

అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థల సహకారంతో..

ఎల్‌ మెంచోను అరెస్టు చేయాలని మెక్సికో సైన్యం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థల సహకారంతో అతడి ఉన్నచోటు గుర్తించి చుట్టుముట్టింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మరణించాడు. అతడి పట్టుబాటుకు అమెరికా ప్రభుత్వం 15 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.136 కోట్లు) బహుమతిగా ప్రకటించింది.

Advertisement