LOADING...
Peter Navarro: భారత్‌లో ఏఐ సేవలకు అమెరికన్లు డబ్బులు ఎందుకు?: ట్రంప్ సలహాదారు
భారత్‌లో ఏఐ సేవలకు అమెరికన్లు డబ్బులు ఎందుకు?: ట్రంప్ సలహాదారు

Peter Navarro: భారత్‌లో ఏఐ సేవలకు అమెరికన్లు డబ్బులు ఎందుకు?: ట్రంప్ సలహాదారు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

వైట్‌హౌస్ మాజీ ప్రధాన వ్యూహకర్త, అమెరికన్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) భారత్ వంటి దేశాల్లో కృత్రిమ మేధ (AI)సేవలకు అమెరికన్ వనరులను ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ప్లాట్‌ఫారమ్‌లు అమెరికా భూభాగంలోని విద్యుత్తును ఉపయోగించి పనిచేస్తున్నప్పటికీ, భారత్‌, చైనా వంటి ఇతర దేశాల్లో పెద్ద సంఖ్యలో వినియోగదారులకు సేవలందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒక అమెరికన్ ఛానల్‌లో వైట్‌హౌస్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్‌తో ఇంటర్వ్యూలో నవారో ఇలా వ్యాఖ్యానించారు: భారత్‌లో ఏఐ సేవల కోసం అమెరికన్లు డబ్బులు ఎందుకు చెల్లిస్తున్నారు? చాట్‌జీపీటీ అమెరికా గడ్డపై పనిచేస్తోంది, ఇక్కడి విద్యుత్తును ఉపయోగిస్తోంది. కానీ, భారత్‌, చైనా వంటి దేశాల్లో పెద్ద ఎత్తున వినియోగదారులకు సేవలు అందిస్తోందన్నారు.

Details

వ్యవసాయ భూముల కొనుగోళ్లపై ఆందోళన

అంతేకాదు, నవారో అమెరికాలో వ్యవసాయ భూముల కొనుగోళ్లపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ సంస్థలు స్థానిక వ్యవసాయ భూములను వాస్తవ ధర కంటే పది రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, దీని కారణంగా అమెరికాలో ఆహార ధరలు పెరగవచ్చని ఆయన చెప్పారు. ఇంతకుముందు, అమెరికా-భారత వ్యాపార విధానాలు, రష్యాతో ఆర్థిక సంబంధాలపై కూడా నవారో విమర్శలు గుప్పించారు. భారత్ అత్యధిక సుంకాలు విధించడంలో అమెరికా ఉద్యోగాలు దెబ్బతింటున్నాయని, లాభం కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్లు, ఉక్రెయిన్-మాస్కో యుద్ధాన్ని అండిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. భారత్ ఈ వ్యాఖ్యలకు స్పష్టంగా స్పందించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, కేవలం దేశీయ ఇంధన భద్రతను కాపాడుకోవడానికి మాత్రమేనని దేశం పేర్కొంది.

Advertisement