Loading...
H-1B Visa: అమెరికన్లకు ఉద్యోగాలు రావట్లేదని హెచ్‌-1బీ వీసాదారులను నిందించడం సరికాదు: భారత సంతతి సీఈఓ 
అమెరికన్లకు ఉద్యోగాలు రావట్లేదని హెచ్‌-1బీ వీసాదారులను నిందించడం సరికాదు: భారత సంతతి సీఈఓ

H-1B Visa: అమెరికన్లకు ఉద్యోగాలు రావట్లేదని హెచ్‌-1బీ వీసాదారులను నిందించడం సరికాదు: భారత సంతతి సీఈఓ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2026
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ఉద్యోగాలు తొలుత స్వదేశీయులకే దక్కాలనే ఉద్దేశంతో ట్రంప్‌ ప్రభుత్వం వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలపై భారత సంతతికి చెందిన సీఈఓ, 'సర్కిల్‌ ప్లస్‌ పే' వ్యవస్థాపకుడు నితీశ్‌ కన్నన్‌ స్పందించారు. అమెరికన్లకు ఉద్యోగాలు లభించకపోవడానికి హెచ్‌-1బీ వీసాదారులను బాధ్యులను చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలో కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఉండగా.. వాటిలో హెచ్‌-1బీ వీసాదారులకు ఏటా లభించేవి 85వేల ఉద్యోగాలు మాత్రమేనని నితీశ్‌ కన్నన్‌ గుర్తుచేశారు. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే అమెరికా ఉద్యోగాల సమస్య మొత్తాన్ని హెచ్‌-1బీ వీసాదారులతో ముడిపెట్టడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

కంప్యూటర్‌ రంగాన్ని పరిశీలించినా ఇదే పరిస్థితి

''అమెరికా కంపెనీలు స్థానికులకు బదులుగా హెచ్‌-1బీ వీసాదారులను ఎందుకు నియమించుకుంటున్నాయనే ప్రశ్న ముందుగా రావాలి.వాస్తవానికి ప్రతి ఏడాది 85వేల హెచ్‌-1బీ వీసాలే జారీ అవుతున్నాయి. అదే సమయంలో అమెరికాలో సుమారు 55-60లక్షల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటున్నాయి'' అని ఆయన తెలిపారు.

కంప్యూటర్‌ రంగాన్ని పరిశీలించినా ఇదే పరిస్థితి కనిపిస్తుందని నితీశ్‌ కన్నన్‌ వివరించారు.

ఒక్క ఈ రంగంలోనే దాదాపు 5లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉండగా.. ప్రతి ఏడాది సుమారు 50వేల మంది అమెరికన్లు మాత్రమే కంప్యూటర్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తున్నారని చెప్పారు.

ఈ గణాంకాలను చూస్తే హెచ్‌-1బీ వీసాదారులకు, అమెరికాలో చదువు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లకు సరిపడా ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

హెచ్‌-1బీ వీసాదారులను నియమించడం అంత సులభం కాదు

అందువల్ల ఒక వర్గానికి ఉద్యోగాలు రావడం లేదనే కారణంతో మరో వర్గాన్ని నిందించడం సరైన విధానం కాదని సూచించారు.

హెచ్‌-1బీ వీసాపై ఉద్యోగిని నియమించుకోవడం అమెరికా కంపెనీలకు అంత తేలికైన ప్రక్రియ కాదని నితీశ్‌ కన్నన్‌ పేర్కొన్నారు.

దీనికి చాలా సమయం, శ్రమతో పాటు భారీగా ఖర్చు కూడా అవుతుందని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

హెచ్‌-1బీ వీసాదారులను నియమించడం అంత సులభం కాదు

''అర్హతలు కలిగిన అమెరికన్‌ అభ్యర్థులు అందుబాటులో ఉన్నప్పుడు.. ఒక కంపెనీ ఇంతటి కష్టమైన, ఖర్చుతో కూడిన హెచ్‌-1బీ ప్రక్రియను ఎందుకు ఎంచుకుంటుంది? స్థానికంగా తగిన అభ్యర్థి లభిస్తే అమెరికన్‌ కంపెనీ అతడినే నియమించుకుంటుంది కదా'' అని నితీశ్‌ కన్నన్‌ ప్రశ్నించారు.

అందువల్ల అమెరికా ఉద్యోగాలపై జరుగుతున్న చర్చలో హెచ్‌-1బీ వీసాదారుల సంఖ్య, అందుబాటులో ఉన్న మొత్తం ఉద్యోగాలు, ఆయా రంగాల్లో ఉన్న నైపుణ్యాల అవసరాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నితీశ్‌ కన్నన్‌ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT