LOADING...
China: ఇండో-పసిఫిక్‌లో చైనా శక్తి ప్రదర్శన.. 43 ఏళ్ల తర్వాత అణు క్షిపణి పరీక్ష
ఇండో-పసిఫిక్‌లో చైనా శక్తి ప్రదర్శన.. 43 ఏళ్ల తర్వాత అణు క్షిపణి పరీక్ష

China: ఇండో-పసిఫిక్‌లో చైనా శక్తి ప్రదర్శన.. 43 ఏళ్ల తర్వాత అణు క్షిపణి పరీక్ష

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన సైనిక సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేలా చైనా కీలక అణు క్షిపణి పరీక్ష నిర్వహించింది. దాదాపు 43 ఏళ్ల తర్వాత బహిరంగంగా జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి (SLBM)ను ప్రయోగించడం ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. సోమవారం పసిఫిక్ మహాసముద్రంలో అణుశక్తితో నడిచే జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం నిర్వహించినట్లు చైనా ప్రకటించింది. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం ఆయుధ పరీక్ష మాత్రమే కాకుండా, శత్రు దేశం తొలి అణు దాడి జరిగినా ప్రతిదాడి చేసే సామర్థ్యం తమకు ఉందని ప్రపంచానికి పంపిన వ్యూహాత్మక సందేశంగా భావిస్తున్నారు.

వివరాలు 

1982 తర్వాత తొలిసారి బహిరంగ పరీక్ష

కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సీనియర్ ఫెలో జావో టోంగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. చైనాకు జలాంతర్గామి ఆధారిత అణు క్షిపణి సామర్థ్యం చాలా కాలంగా ఉన్నప్పటికీ, బహిరంగంగా ఇటువంటి పరీక్ష నిర్వహించడం మాత్రం 1982 తర్వాత ఇదే మొదటిసారి. ఈ ప్రయోగానికి ముందు ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్ వంటి దేశాలకు సమాచారం ఇచ్చిన చైనా.. అయితే ఏ రకమైన క్షిపణిని ప్రయోగించిందనే అంశాన్ని వెల్లడించలేదు. JL-3 క్షిపణి అయ్యే అవకాశాలు చైనా అధికారిక ప్రసార సంస్థ 'సీసీటీవీ' వెల్లడించిన వివరాలు,సైనిక విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ ప్రయోగంలో 10,000 కిలోమీటర్లకు పైగా దాడి పరిధి కలిగిన అత్యాధునిక JL-3 జలాంతర్గామి ఆధారిత బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు.

వివరాలు 

అణు నిరోధక శక్తిపై వ్యూహాత్మక సంకేతం

ఈ క్షిపణిని ప్రస్తుతం సేవల్లో ఉన్న టైప్-094 వ్యూహాత్మక జలాంతర్గామి లేదా నిర్మాణంలో ఉన్న అత్యాధునిక టైప్-096 జలాంతర్గామి నుంచి ప్రయోగించి ఉండే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరీక్ష ద్వారా చైనా తన సముద్రగర్భ అణు నిరోధక వ్యవస్థ మరింత బలోపేతమైందని ప్రపంచానికి సంకేతాలు ఇచ్చినట్లు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భూమిపై లేదా వైమానిక స్థావరాలపై దాడులు జరిగినా, సముద్రంలో ఉన్న జలాంతర్గాముల నుంచి అణు ప్రతిదాడి చేసే సామర్థ్యం తమకు ఉందని చైనా ఈ పరీక్షతో చాటిచెప్పినట్లు వారు విశ్లేషిస్తున్నారు.

Advertisement

వివరాలు 

ప్రాంతీయ దేశాల్లో పెరిగిన ఆందోళన

చైనా అణు సామర్థ్యాల వేగవంతమైన విస్తరణపై అమెరికా రక్షణ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి థామస్ పిగాట్ మాట్లాడుతూ.. చైనా పెంచుకుంటున్న అణ్వాయుధ సామర్థ్యం అంతర్జాతీయ భద్రతకు సవాల్‌గా మారుతోందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ ఈ పరీక్షను ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా అభివర్ణించారు. న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ కూడా దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, జపాన్ రక్షణ శాఖ చైనా సైనిక కదలికలపై మరింత నిఘా పెంచినట్లు వెల్లడించింది.

Advertisement

వివరాలు 

చారిత్రాత్మక సందేశమా?

ఈ ప్రయోగం సమయంపైనా అంతర్జాతీయంగా చర్చ సాగుతోంది. 1937 జులై 7న జరిగిన 'మార్కో పోలో బ్రిడ్జ్' ఘటనతో జపాన్‌పై చైనా పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రారంభించిన చారిత్రాత్మక సంఘటన వార్షికోత్సవానికి ఒక రోజు ముందు ఈ పరీక్ష జరగడం వెనుక వ్యూహాత్మక సందేశం ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యానాలను చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఖండించారు. ఈ పరీక్షను ఇతర దేశాలు అతిగా అర్థం చేసుకోవద్దని, చైనా ఎప్పటికీ ఆత్మరక్షణకే ప్రాధాన్యం ఇస్తుందని, శాంతియుత అణు విధానానికే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

వివరాలు 

'న్యూక్లియర్ ట్రైయాడ్' సామర్థ్యానికి బలం

ఈ తాజా పరీక్షతో భూమి, గగనం, సముద్ర మార్గాల ద్వారా అణు దాడులు నిర్వహించే 'న్యూక్లియర్ ట్రైయాడ్' సామర్థ్యాన్ని చైనా మరింత బలోపేతం చేసుకున్నట్లు రక్షణ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక సమీకరణలు మరింత మారే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Advertisement