MEA: భారత్‌ను ఎందుకు నమ్మాలి?.. నార్వే విలేకరికి భారత ప్రతినిధి గట్టి సమాధానం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాని నరేంద్ర మోదీ నార్వే పర్యటన సందర్భంగా ఓస్లోలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ స్థానిక మహిళా విలేకరి ప్రశ్నలకు ఘాటుగా స్పందించారు. భారతదేశంలో మానవ హక్కుల పరిస్థితి, పత్రికా స్వేచ్ఛపై ఆమె పదేపదే ప్రశ్నలు సంధించారు. ''మీ దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను అడ్డుకుంటామని హామీ ఇవ్వగలరా? మేము మిమ్మల్ని ఎందుకు నమ్మాలి?''అంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సిబి జార్జ్.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ విస్తృతిని చాలామంది పూర్తిగా అర్థం చేసుకోవడం లేదన్నారు. దేశంలో మీడియా వ్యవస్థ ఎంతో పెద్దదిగా,బలంగా ఉందని వివరించారు.
వివరాలు
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు కల్పించింది
కేవలం దిల్లీలోనే ఇంగ్లిష్, హిందీతో పాటు పలు భాషల్లో 200కు పైగా వార్తా చానళ్లు పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రతి రోజు అనేక ప్రధాన వార్తలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కొందరు పనికిరాని, అవగాహనలేని స్వచ్ఛంద సంస్థలు విడుదల చేసే తప్పుడు నివేదికలను ఆధారంగా చేసుకుని భారతదేశంపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ప్రశ్నలు అడగడం సరికాదని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు కల్పించిందని సిబి జార్జ్ స్పష్టం చేశారు. ఎక్కడైనా హక్కుల ఉల్లంఘనలు జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయించే పూర్తి చట్టపరమైన రక్షణ దేశంలో ఉందన్నారు.
వివరాలు
ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మార్చడమే మానవ హక్కులకు నిదర్శనమని వ్యాఖ్య
1947లో స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే భారతదేశం మహిళలకు ఓటు హక్కు కల్పించిందని గుర్తు చేశారు. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆ హక్కును మహిళలకు ఇవ్వడానికి దశాబ్దాలు పట్టిందన్నారు. ప్రజలు ఓటు ద్వారా ప్రభుత్వాలను మార్చే అవకాశం కలిగి ఉండటమే నిజమైన మానవ హక్కుల పరిరక్షణకు గొప్ప ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో ఆ ప్రజాస్వామ్య ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని, దానిపై తమకు గర్వముందని ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ చర్చ కొనసాగుతున్న సమయంలో మహిళా విలేకరి ఒక దశలో సమావేశం మధ్యలో బయటకు వెళ్లి, కొంతసేపటి తర్వాత తిరిగి రావడం అక్కడున్న వారిని ఆకర్షించింది.