Israel- Iran War: ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య గొడవలెందుకు..? ఘర్షణకు దారి తీసిన పరిస్థితులు ఇవే!
ఇరాన్ క్షిపణుల దాడి తర్వాత, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి దారి తీస్తుందా? ఈ దాడులు మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా? అన్న ప్రశ్నలు ప్రపంచాన్ని ఇప్పుడు కలవరపరుస్తున్నాయి. ఇటీవల జరిగిన ఘర్షణలు, ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు పొందుతున్న హిజ్బుల్లా మధ్య తీవ్రతను పెంచాయి. లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారాయి. ఈ ఘర్షణలు 1979లో ప్రారంభమైన ఇరాన్ ఇస్లామిక్ విప్లవంతో ముడిపడి ఉన్నాయి.
ఇజ్రాయెల్ దాడుల కారణంగా 41వేల మంది మృతి
1979లో ఇరాన్ తన చివరి రాజు షా మొహమ్మద్ రెజా పహ్లవిని గద్దె దించడంతో, ఇరాన్, లెబనాన్‌లోని హిజ్బుల్లా, పాలస్తీనాలోని హమాస్ వంటి మిలిటెంట్ గ్రూప్‌లతో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. ఈ కాలంలో ఇజ్రాయెల్ పాలస్తీనా వ్యతిరేక ధోరణిని అనుసరించడంతో ఇరాన్-ఇజ్రాయెల్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2023 అక్టోబర్ 7న, హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌లోకి దాడి చేసి, పెద్ద సంఖ్యలో పౌరులను హతమార్చింది. ఈ దాడి తరువాత ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధం ప్రకటించింది. ముఖ్యంగా గాజా ప్రాంతంలో భారీగా దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా 41,600 మంది మరణించినట్లు పాలస్తీనా స్పష్టం చేసింది.
యుద్ధానికి దారి తీసే అవకాశం?
గతేడాది డిసెంబర్‌లో ఇజ్రాయెల్, సిరియాపై జరిపిన దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ నేత మరణించారు. సెప్టెంబర్ 17న, లెబనాన్, సిరియాలో భారీ పేలుళ్లు జరిగాయి. తరువాత, ఇజ్రాయెల్ హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేపట్టింది. సెప్టెంబర్ 30న ఇజ్రాయెల్, లెబనాన్‌లో భూదాడులు ప్రారంభించాలని ప్రకటించింది. అక్టోబర్ 1న ఇరాన్ ఇజ్రాయెల్ పై 200 క్షిపణులతో దాడి చేసింది. వెంటనే ఇజ్రాయెల్ ప్రతిస్పందించింది. ఇక ఈ పరిణామాలు యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.