చమురు ఉత్పత్తిదారు అర్జెంటీనా ఇంధన కొరతను ఎందుకు ఎదుర్కొంటోంది?
దక్షిణ అమెరికాలో ప్రముఖ చమురు ఉత్పత్తిదారుగా ఉన్న అర్జెంటీనా కొన్ని రోజులుగా తీవ్రమైన ఇంధ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్ది బారులు తీరాయి. నవంంబర్ 19న అర్జెంటీనాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధర కొరత విషయం రాజకీయ అంశంగా కూడా మారింది. ప్రపంచంలోని అత్యంత గ్యాస్-రిచ్ దేశాలలో ఒకటైన అర్జెంటీనా.. దేశీయ రిఫైనింగ్ సమస్యలు, డాలర్ల కొరతతో పాటు ఇటీవల ఇంధన డిమాండ్ కూడా భారీగా పెరిగిన కారణంగా గత వారం నుంచి తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బంది పడుతోంది.
సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు
ఇంధన కొరత సమస్య పరిష్కారానికి అర్జెంటీనా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. చమురు కంపెనీలు ఎగుమతులను పూర్తిగా తగ్గించాలని, దేశీయంగా సరఫరా చేయాలని ఆదేశించారు. డాలర్ల కొరత కారణంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం కూడా అర్జెంటీనాకు కష్టంగా మారింది. ఇదే సమయంలో ఇంధన సమస్యను త్వరలో పరిష్కరించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే 10 ఇంధన కంటైనర్లు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు రాయిటర్స్ రాసుకొచ్చంది. అయితే,ఈ ఇంధనాన్ని పంపిణీ చేయడానికి కొన్ని రోజులు పడుతుందని, ఇంధన మంత్రి పేర్కొన్నారు.