Delcy Rodriguez in India: పుట్టపర్తికి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్.. సత్యసాయి బాబాపై ఎందుకింత భక్తి?
ఈ వార్తాకథనం ఏంటి
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్(Delcy Rodríguez) ఐదు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిని సందర్శించనున్నారు. ఇంధన రంగ సహకారం,ముడి చమురు కొనుగోలు,వాణిజ్యం,పెట్టుబడులు,ఔషధాలు,సాంకేతిక రంగాల్లో భారత్‌తో సంబంధాల విస్తరణే ఆమె పర్యటన ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ, పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ఆశ్రమ సందర్శన ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. దానికి కారణం ఆధ్యాత్మిక గురువు శ్రీసత్య సాయిబాబా పట్ల ఆమెకు ఉన్న గాఢ భక్తి. డెల్సీ రోడ్రిగ్జ్ ఇప్పటికే పలుమార్లు ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. 2019, 2023, 2024 సంవత్సరాల్లో కూడా ఆమె పుట్టపర్తికి వచ్చి సత్యసాయి బాబా సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆశ్రమంలో తనకు లభించే ప్రశాంతత, ఆధ్యాత్మిక అనుభూతి గురించి ఆమె గతంలో పలుమార్లు ప్రస్తావించారు.
వివరాలు
సత్యసాయి బాబా మరణించిన రోజు వెనిజులాలో సంతాప దినం
డెల్సీ రోడ్రిగ్జ్ మాత్రమే కాదు,వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో కూడా సత్యసాయి బాబా భక్తుడిగానే ప్రసిద్ధి పొందారు. ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ద్వారా 2005లో సత్యసాయి బాబా గురించి తెలుసుకున్న మదురో, అదే ఏడాది పుట్టపర్తికి వచ్చి ఆశీస్సులు పొందినట్లు సమాచారం. అనంతరం సత్యసాయి బాబా బోధనలు తమ కుటుంబ జీవితంపై గణనీయ ప్రభావం చూపాయని వెనిజులా వర్గాలు పేర్కొన్నాయి. సత్యసాయి బాబా మరణించిన రోజు వెనిజులాలో సంతాప దినంగా పాటించినట్లు కూడా చెబుతారు. లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాలో సత్యసాయి బాబాకు విశేష ఆదరణ ఉంది. ప్రస్తుతం అక్కడ సుమారు రెండు లక్షల మంది అనుచరులు ఉన్నట్లు అంచనా. అనేక సాయి కేంద్రాలు దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
వివరాలు
షిర్డీ సాయి బాబా పునర్జన్మ సత్యసాయి బాబా
1974లో రాజధాని కారాకస్లో ప్రారంభమైన తొలి సాయి కేంద్రం ద్వారా ఈ ఆధ్యాత్మిక ఉద్యమం విస్తరించింది. అనంతరం సత్యసాయి బాబాకు సంబంధించిన అద్భుతాల కథనాలు, సేవా కార్యక్రమాలు ప్రజల్లో ఆయనకు మరింత ఆదరణను తీసుకొచ్చాయి. రత్నాకరం సత్యనారాయణ రాజుగా జన్మించిన సత్యసాయి బాబా, తాను షిర్డీ సాయి బాబా పునర్జన్మ అని ప్రకటించారు. "అందరినీ ప్రేమించండి,అందరికీ సేవ చేయండి;ఎప్పుడూ సహాయం చేయండి,ఎవరికీ హాని చేయొద్దు"అనే సందేశాన్ని ఆయన ప్రపంచానికి అందించారు. విద్య,వైద్యం,తాగునీటి రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన సత్యసాయి సంస్థలు దేశవ్యాప్తంగా వేలాది మందికి సేవలు అందించాయి. 2011 ఏప్రిల్ 24న 84 ఏళ్ల వయసులో సత్యసాయి బాబా కన్నుమూసినా,ఆయన బోధనలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను ప్రభావితం చేస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
2005లో సత్యసాయిబాబాతో నికోలస్ మదురో
Did you know? Nicolás Maduro, former President of Venezuela, was a longtime devotee of Sri Sathya Sai Baba from Puttaparthi. He & his wife visited the ashram in 2005 for a private audience. 🕉️#Maduro #SaiBaba #Puttaparthi #VenezuelaCrisis #venezuala pic.twitter.com/Xy1bCUirMS
— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) January 6, 2026