Loading...
Wildfire : వాషింగ్టన్‌లో కార్చిచ్చు విధ్వంసం.. 4.50 లక్షల ఎకరాలు బూడిద, రెడ్‌ ఫ్లాగ్‌ హెచ్చరిక
వాషింగ్టన్‌లో కార్చిచ్చు విధ్వంసం.. 4.50 లక్షల ఎకరాలు బూడిద, రెడ్‌ ఫ్లాగ్‌ హెచ్చరిక

Wildfire : వాషింగ్టన్‌లో కార్చిచ్చు విధ్వంసం.. 4.50 లక్షల ఎకరాలు బూడిద, రెడ్‌ ఫ్లాగ్‌ హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాతావరణ మార్పుల ప్రభావంతో అమెరికా, కెనడాలో కార్చిచ్చులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్ర పరిధిలో అటవీ ప్రాంతాల్లో చెలరేగిన మంటలు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ కార్చిచ్చుల కారణంగా ఇప్పటికే సుమారు 4.50 లక్షల ఎకరాల అటవీ భూమి దగ్ధమై, వేలాది చెట్లు బూడిదయ్యాయి. మంటలు సమీప నగరాల వైపు కూడా విస్తరిస్తుండటంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి దాదాపు 4 వేల మంది అగ్నిమాపక సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.

వివరాలు

పరిస్థితి మరింత ఆందోళనకరం

తూర్పు వాషింగ్టన్ ప్రాంతంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అక్కడి నుంచి సుమారు 2.30 లక్షల మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రస్తుతం సుమారు 3 వేల ఎకరాల విస్తీర్ణంలో మంటలు చురుగ్గా వ్యాపిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

బలమైన గాలులు వీయడంతో మంటలను అదుపులోకి తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి పెద్ద సవాల్‌గా మారింది.

అధికారుల సమాచారం ప్రకారం, శనివారం మధ్యాహ్నం ఈ అగ్నికీలలు మొదలయ్యాయి. ప్రస్తుతం వాషింగ్టన్ రాష్ట్రంలో దాదాపు 4 వేల ఇళ్లకు మంటల ముప్పు పొంచి ఉంది.

వివరాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

స్పోకేన్ ప్రాంతంలో మంటలు వేగంగా విస్తరిస్తుండటంతో 200 ఇళ్లు, పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులను ఖాళీ చేయించినట్లు ఆ నగర మేయర్ లిసా బ్రౌన్ తెలిపారు.

ఈ కార్చిచ్చుల ప్రభావం 5 కోట్ల మందికిపైగా అమెరికన్లపై ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మంటలు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తూర్పు వాషింగ్టన్‌తో పాటు పలు ప్రాంతాలకు అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 'రెడ్ ఫ్లాగ్' హెచ్చరిక జారీ చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ADVERTISEMENT