Loading...
Israel Election: ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటు.. ఐజెన్‌కాట్ ముందున్న సవాళ్లు
ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటు.. ఐజెన్‌కాట్ ముందున్న సవాళ్లు

Israel Election: ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటు.. ఐజెన్‌కాట్ ముందున్న సవాళ్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు దశాబ్దంన్నర కాలంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాలనకు ముగింపు పలికే దిశగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో నెతన్యాహు విఫలమవడంతో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ఈ ప్రతిష్టంభనకు పరిష్కారం కనుగొనే బాధ్యతను అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్.. మాజీ ఆర్మీ చీఫ్ గాడీ ఐజెన్‌కాట్‌కు అప్పగించారు. అయితే, 120 మంది సభ్యులున్న క్నెస్సెట్ (పార్లమెంట్)లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 మంది సభ్యుల మద్దతు కూడగట్టడం ఆయనకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ఐజెన్‌కాట్ వ్యూహాలు రచిస్తున్నారు.

వివరాలు 

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 28 రోజుల గడువు

అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇజ్రాయెల్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది.

ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతును కూడగట్టలేకపోయారు.

దీంతో అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రత్యామ్నాయ నాయకత్వానికి అవకాశం కల్పించారు.

ఇప్పటికే 67 మంది చట్టసభ సభ్యుల మద్దతు కూడగట్టిన యషార్ పార్టీ అధినేత, మాజీ ఆర్మీ చీఫ్ గాడీ ఐజెన్‌కాట్‌ను నవంబర్ 8న ప్రభుత్వ ఏర్పాటుకు అధికారికంగా ఆహ్వానించారు.

సభలో విశ్వాస తీర్మానాన్ని నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయనకు 28 రోజుల సమయం ఇచ్చారు.

అవసరమైతే మరో 14 రోజుల పాటు గడువును పొడిగించే అవకాశం కూడా కల్పించారు.

వివరాలు 

అంకెల గారడీ.. ముందున్న సవాళ్లు

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఐజెన్‌కాట్ రెండు ప్రధాన సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఆయన నేతృత్వంలోని నెతన్యాహు వ్యతిరేక కూటమిలో యషార్ పార్టీకి 21, టుగెదర్ పార్టీకి 12, ది డెమోక్రాట్స్‌కు 8, అవిగ్డోర్ లిబర్‌మాన్ నేతృత్వంలోని ఇజ్రాయెల్ బీటీను పార్టీకి 7 సీట్లు ఉన్నాయి.

ఈ నాలుగు పార్టీలకు కలిపి 48 స్థానాల బలం మాత్రమే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 సీట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరో 13 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి.

దీంతో ఇతర పార్టీల మద్దతు కోసం ఐజెన్‌కాట్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

అరబ్ పార్టీల మద్దతు కీలకం

ఐజెన్‌కాట్‌కు ఇప్పటికే రెండు ప్రధాన అరబ్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. జాయింట్ లిస్ట్‌కు 11, రామ్ పార్టీకి 8 స్థానాలు ఉన్నాయి.

ఈ రెండు పార్టీలను కలుపుకుంటే ఐజెన్‌కాట్ కూటమి బలం 67కు చేరుతుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సులభమవుతుంది.

అయితే, ఈ ప్రతిపాదనకు కూటమిలోనే అభ్యంతరాలు ఎదురవుతున్నాయి.

అవిగ్డోర్ లిబర్‌మాన్ నేతృత్వంలోని ఇజ్రాయెల్ బీటీను పార్టీ.. అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వంలో కొనసాగడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

అందువల్ల ఆ పార్టీలను నేరుగా ప్రభుత్వంలో భాగస్వాములుగా చేసుకోకుండా, బయట నుంచి మద్దతు ఇచ్చేలా ఒప్పించాల్సిన పరిస్థితి ఐజెన్‌కాట్‌కు ఎదురైంది.

ఈ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కీలకంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు 

ఛాందసవాద పార్టీలతోనూ చర్చలు

మరోవైపు నెతన్యాహు కూటమిలో ఉన్న అతి ఛాందసవాద పార్టీల మద్దతు పొందడం కూడా ఐజెన్‌కాట్ ముందున్న మరో మార్గం.

యునైటెడ్ తోరా జుడాయిజం (యూటీజే)కు 7, షాస్ పార్టీకి 6 స్థానాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీల మద్దతు లభిస్తే 61 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను సులభంగా చేరుకోవచ్చు.

అయితే, ఇక్కడా కొన్ని విధానపరమైన విభేదాలు అడ్డంకిగా మారాయి.

యూదు ఛాందసవాద యువకులకు తప్పనిసరి సైనిక సేవను అమలు చేయాలన్నది ఐజెన్‌కాట్ కూటమి ప్రధాన డిమాండ్.

కానీ, ఈ రెండు పార్టీలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

నెతన్యాహును అధికారానికి దూరం చేయాలనే లక్ష్యంతో ఐజెన్‌కాట్ ఈ విషయంలో కొంతకాలం రాజీ పడతారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

రాజకీయ రాజీలు తప్పవు: ఐజెన్‌కాట్

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైతే వివిధ పక్షాలతో రాజీ పడాల్సి ఉంటుందని ఐజెన్‌కాట్ సంకేతాలిచ్చారు.

"ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కొన్నిసార్లు సృజనాత్మక రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని పక్షాలూ కొన్ని విషయాల్లో రాజీ పడక తప్పదు" అని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ నెతన్యాహు రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఐజెన్‌కాట్ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు.

నెతన్యాహు నాయకత్వంలో పనిచేసే ప్రసక్తే లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

మరోసారి ఎన్నికలు తప్పవా?

నిర్దేశించిన గడువులోగా ఐజెన్‌కాట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే, తదుపరి అవకాశం మళ్లీ నెతన్యాహుకు దక్కవచ్చు.

అయితే, ఆయన కూడా పార్లమెంటులో మెజారిటీ నిరూపించుకోలేకపోతే దేశంలో మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అలా జరిగితే 2027 ప్రారంభంలో ఇజ్రాయెల్ మరోసారి ఎన్నికల ప్రక్రియలోకి వెళ్లే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఐజెన్‌కాట్ ఎవరితో చేతులు కలుపుతారు? ఏ అంశాల్లో రాజీ పడతారు? అన్నదానిపైనే ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉంది.

ఆయన తీసుకునే నిర్ణయాలు ఇజ్రాయెల్ భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం చేయనున్నాయి.

ADVERTISEMENT