LOADING...
Mojtaba Khamenei: తండ్రి అంత్యక్రియల్లో మొజ్తాబా ఖమేనీ కనిపిస్తారా? 
తండ్రి అంత్యక్రియల్లో మొజ్తాబా ఖమేనీ కనిపిస్తారా?

Mojtaba Khamenei: తండ్రి అంత్యక్రియల్లో మొజ్తాబా ఖమేనీ కనిపిస్తారా? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ కార్యక్రమం కంటే ఎక్కువగా ఇప్పుడు అందరి దృష్టి ఆయన కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీపై నిలిచింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బహిరంగంగా కనిపించని ఆయన తండ్రి అంత్యక్రియలకు హాజరవుతారా? ఇప్పటివరకు రహస్య ప్రాంతం నుంచి పాలనా వ్యవహారాలను నిర్వహిస్తున్న మొజ్తాబా ఈ సందర్భంగా ప్రజల ముందుకు వస్తారా? అనే చర్చ సాగుతోంది.

వివరాలు 

సుప్రీం లీడర్ నివాస సముదాయంపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన మొజ్తాబా ఖమేనీ

ఫిబ్రవరి 28న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ నివాస సముదాయంపై జరిగిన దాడిలో మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు అప్పట్లో ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆయన కాలికి తీవ్ర గాయాలయ్యాయని, ముఖానికి కూడా కాలిన గాయాలు తగిలినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన సజీవంగానే ఉన్నారని, అత్యంత రహస్య ప్రాంతంలో వైద్యం అందిస్తున్నారని సమాచారం. ఇజ్రాయెల్ నిఘా దృష్టికి చిక్కకుండా ఉండేందుకు ప్రభుత్వంలోని కీలక అధికారులు కూడా ఆయనను నేరుగా కలవడం లేదని గతంలో కథనాలు వెలువడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో మాత్రం మొజ్తాబా పేరుతోనే అధికారిక ప్రకటనలు వెలువడుతున్నాయి. అయితే చాలా కాలంగా ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో ఆరోగ్య పరిస్థితిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

జులై 5 నుంచి 9 వరకు అలీ ఖమేనీ అంత్యక్రియలు 

ఈ నేపథ్యంలో తండ్రి అంత్యక్రియల్లో ఆయన ప్రత్యక్షమవుతారా లేదా అన్న అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అలీ ఖమేనీ మరణానంతరం మొజ్తాబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్న విషయం తెలిసిందే. జులై 5 నుంచి 9 వరకు అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. మొదట టెహ్రాన్, ఖోమ్ నగరాల్లో పలు అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించి, జులై 9న ఆయన స్వస్థలం మషాద్‌లో ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమానికి హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానం పంపినట్లు సమాచారం. అయితే దీనిపై భారత ప్రభుత్వం నుంచి అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.

Advertisement

వివరాలు 

ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

మరోవైపు ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. ప్రస్తుతం పరిస్థితి కొంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ, భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అలీ ఖమేనీ అంత్యక్రియలను యథావిధిగా నిర్వహిస్తారా లేదా వాయిదా వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అందరి దృష్టి మాత్రం మొజ్తాబా ఖమేనీ ఈ కార్యక్రమంలో బహిరంగంగా కనిపిస్తారా లేదా అన్న అంశంపైనే కేంద్రీకృతమైంది.

Advertisement