Loading...
UK: బ్రిటన్‌లో దారుణం.. 13 ఏళ్ల పాటు భార్యకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం
బ్రిటన్‌లో దారుణం.. 13 ఏళ్ల పాటు భార్యకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం

UK: బ్రిటన్‌లో దారుణం.. 13 ఏళ్ల పాటు భార్యకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యకు తెలియకుండా ఆమెకు మత్తుమందు ఇచ్చి, ఇతర పురుషులతో లైంగిక దాడులు చేయించిన భర్త ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా 13 ఏళ్ల పాటు ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ కేసులో నలుగురు పురుషులను బ్రిటన్‌ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఇలాంటి కేసులో జ్యూరీ విచారణ ద్వారా నిందితులు దోషులుగా తేలడం యూకేలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. విల్ట్‌షైర్‌లోని స్విండన్‌కు చెందిన ఫిలిప్‌ యంగ్‌(50)తన భార్య జోవాన్‌ యంగ్‌కు 13 ఏళ్ల పాటు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఇప్పటికే అంగీకరించాడు. ఆమెకు తెలియకుండా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు, యాప్‌లలో ఇతర పురుషులతో లైంగిక సంబంధాల కోసం ప్రకటనలు పెట్టేవాడు.

వివరాలు 

నలుగురు నిందితులు దోషులుగా నిర్ధారణ

అనంతరం వారిని ఇంటికి ఆహ్వానించి భార్యపై లైంగిక దాడులు చేయించేలా ఏర్పాట్లు చేసేవాడు.

ఈ వ్యవహారంలో నార్మన్‌ మాక్సోని (48), రిచర్డ్‌ విల్కిన్స్‌ (62), కానర్‌ శాండర్సన్‌-డాయిల్‌ (32), మహమ్మద్‌ హసన్‌ (38)లను కోర్టు దోషులుగా నిర్ధారించింది.

కోర్టు విచారణలో రిచర్డ్‌ విల్కిన్స్‌, నార్మన్‌ మాక్సోని ఒక్కొక్కరు అత్యాచారం చేసినట్లు జ్యూరీ నిర్ధారించింది.

కానర్‌ శాండర్సన్‌-డాయిల్‌ లైంగిక వేధింపులు, లైంగిక దాడికి పాల్పడినట్లు తేల్చింది.

రిచర్డ్‌ విల్కిన్స్‌ లైంగిక దాడికి, మహమ్మద్‌ హసన్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జ్యూరీ స్పష్టం చేసింది.

ఈ కేసులో మరో నిందితుడైన డీన్‌ హామిల్టన్‌ గత ఫిబ్రవరిలోనే అత్యాచారంతో పాటు పలు నేరాలను అంగీకరించాడు.

వివరాలు 

నా జీవితమే మారిపోయింది: బాధితురాలు

ఈ ఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని బాధితురాలు జోవాన్‌ యంగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తే తనకు ఇంతటి ద్రోహం చేస్తాడని ఊహించలేదని తెలిపారు.

ఈ దారుణం తన జీవితంపైనే కాకుండా పిల్లల భవిష్యత్తుపైనా తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు.

తనపై జరిగిన నేరంలో ఇతరులు కూడా భాగస్వాములయ్యారని, వారంతా స్వచ్ఛందంగానే ఈ దారుణాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

కోర్టు ఇచ్చిన తీర్పు ఇలాంటి ఘటనల్లో బాధిత మహిళలకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

వివరాలు 

బాధితురాలి ధైర్యాన్ని ప్రశంసించిన న్యాయమూర్తి

విచారణ సందర్భంగా బాధితురాలు చూపిన ధైర్యాన్ని న్యాయమూర్తి ప్రశంసించారు.

దోషులకు డిసెంబర్‌ 21, 22 తేదీల్లో శిక్షలు ఖరారు చేయనున్నారు.

మరోవైపు, మత్తుమందు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడే ఇలాంటి ఘటనలు బయటపడటం చాలా కష్టమని పోలీసులు తెలిపారు.

బాధితులకు తమపై ఏం జరిగిందో తెలియకపోవడం, ఘటనకు సంబంధించిన జ్ఞాపకాలు పూర్తిగా లేకపోవడం, మత్తులో జరిగిన విషయంగా భావించడం వంటి కారణాలతో ఫిర్యాదులు చేయడంలో ఆలస్యం అవుతోందని వివరించారు.

ఈ కేసుకు సంబంధించి మరో వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

ADVERTISEMENT