
World's military: నాలుగు దశాబ్దాలలో పెరిగిన ప్రపంచ సైనిక వ్యయం..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచదేశాల సైనిక వ్యయం గత కొద్ది కాలంగా గణనీయంగా పెరిగింది.
భౌగోళికంగా, రాజకీయంగా చోటుచేసుకుంటున్న మార్పులు, అలాగే వివిధ యుద్ధ పరిస్థితులు ప్రభుత్వాలను రక్షణ ఖర్చులను పెంచే దిశగా నడిపిస్తున్నాయి.
2024 సంవత్సరంలో ప్రపంచదేశాలు తమ సైనిక రంగానికి మొత్తం 2.7 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేశాయి.
గాజా, ఉక్రెయిన్ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాల ప్రభావంతో యూరప్, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో ఈ వ్యయం మరింతగా పెరిగినట్టు వెల్లడైంది.
ఈ విషయాలు స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) తాజా నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా 2024లో 100కు పైగా దేశాలు తమ సైనిక ఖర్చులను పెంచాయి.
వివరాలు
యూరప్‌లో అనూహ్యమైన పెరుగుదల
గత సంవత్సరం 2023తో పోలిస్తే మొత్తం ఖర్చు 9.4శాతం పెరిగింది. ఇది వరుసగా పదవ సంవత్సరం సైనిక వ్యయంలో పెరుగుదల నమోదు కావడం కూడా గమనార్హం.
ఈ పెరుగుదల ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తోంది.
యూరప్‌లోని దేశాల్లో(రష్యా సహా)సైనిక వ్యయం మునుపెన్నడూ లేనంతగా పెరిగింది.
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం,నాటో కూటమిపై అమెరికా నిబద్ధతపై ఏర్పడిన సందేహాల వాతావరణంలో సైనిక ఖర్చులు ఏకంగా 17శాతం పెరిగాయి.
ఇది ప్రచ్ఛన్న యుద్ధం అనంతర కాలంలో నమోదైన సైనిక వ్యయాలను కూడా అధిగమించింది.
రష్యా ఒక్కదాని సైనిక వ్యయం మాత్రమే 2024లో 149బిలియన్ డాలర్లకు చేరుకుంది,ఇది 2023తో పోలిస్తే 38 శాతం అధికం.
ఇది రష్యా జీడీపీకి 7.1శాతంగా ఉండగా,మొత్తం ప్రభుత్వ వ్యయంలో 19 శాతంగా ఉంది.
వివరాలు
ఉక్రెయిన్ జీడీపీలో 34 శాతం వాటా
ఉక్రెయిన్ విషయానికొస్తే, 2024లో ఆ దేశం 2.9 శాతం పెరుగుదలతో 64.7 బిలియన్ డాలర్లను సైనిక రంగానికి ఖర్చు చేసింది.
ఇది రష్యా ఖర్చులో 43 శాతం కాగా, ఉక్రెయిన్ జీడీపీలో 34 శాతం వాటాను కలిగి ఉంది.
ఈ సంవత్సరం ఉక్రెయిన్ అత్యధిక సైనిక వ్యయం చేసిన దేశంగా నిలిచింది. తన పన్నుల ఆదాయం దాదాపు మొత్తాన్ని సైనిక అవసరాలకు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. జ
ర్మనీ కూడా తన సైనిక ఖర్చును 28 శాతం పెంచి 88.5 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లింది.
దీంతో భారతదేశాన్ని అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద సైనిక ఖర్చు చేసే దేశంగా అవతరించింది.
జర్మనీ పునరేకీకరణ తరువాత ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడం ఇదే తొలిసారి.
వివరాలు
చైనా పెంపు కొనసాగిస్తోంది
ప్రపంచంలో రెండో అతిపెద్ద సైనిక ఖర్చుదారుడిగా ఉన్న చైనా కూడా 2024లో తన రక్షణ బడ్జెట్‌ను పెంచింది.
7 శాతం పెరుగుదలతో చైనా సైనిక వ్యయం 314 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
సైన్యాన్ని ఆధునీకరించడంతో పాటు, సైబర్ వార్‌ఫేర్ సామర్థ్యాల అభివృద్ధి, అణ్వాయుధాల విస్తరణ వంటి అంశాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఆసియా ఖండంలోని మొత్తం సైనిక ఖర్చులో సగం వాటా ఒక్క చైనాదే కావడం విశేషం.
వివరాలు
తగ్గేదే లేదన్న అమెరికా
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సైనిక వ్యయం చేసే దేశంగా అమెరికా తన స్థానాన్ని కొనసాగిస్తోంది.
మొత్తం గ్లోబల్ సైనిక ఖర్చులో అమెరికా వాటా 37 శాతంగా ఉంది.
నాటో కూటమిలో 2024లో జరిగిన మొత్తం ఖర్చులో 66 శాతం అమెరికా ఖర్చు చేసినదే.
5.7 శాతం పెంపుతో అమెరికా సైనిక వ్యయం ఈ ఏడాది 997 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలోని 32 దేశాల సమష్టి సైనిక ఖర్చు 1.5 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.
వివరాలు
2025లో అత్యధిక రక్షణ బడ్జెట్ కేటాయించిన దేశాలు
ప్రపంచంలో భౌగోళికంగా, రాజకీయంగా ఏర్పడుతున్న అస్థిరత మధ్య దేశాలు తమ బలాన్ని ప్రదర్శించేందుకు సైనిక బలగాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయి.
గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం, 2025లో అత్యధిక రక్షణ బడ్జెట్ కేటాయించిన దేశాలు క్రిందివిగా ఉన్నాయి:
యునైటెడ్ స్టేట్స్ (అమెరికా) - 895 బిలియన్ డాలర్లు
చైనా - 266.85 బిలియన్ డాలర్లు
రష్యా - 126 బిలియన్ డాలర్లు
భారత్ - 75 బిలియన్ డాలర్లు
సౌదీ అరేబియా - 74.76 బిలియన్ డాలర్లు