Sing Geetham Review: 'సింగ్ గీతం' రివ్యూ.. 94 ఏళ్ల వయసులోనూ సింగీతం మ్యాజిక్.. ఈ ప్రయోగం వర్కౌట్ అయిందా?
ఈ వార్తాకథనం ఏంటి
94 ఏళ్ల వయసులోనూ సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్న లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన చిత్రం 'సింగ్ గీతం'. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంలో అయాన్, అహల్యా బమ్రూ, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటించారు. జూన్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ముందురోజే ప్రత్యేక ప్రీమియర్లు ప్రదర్శించారు.
వివరాలు
కథ ఏంటంటే?
ప్రతాప్ (అయాన్) ఓ అనాథ యువకుడు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఓ లాయర్ అతనికి అతని తండ్రి వదిలి వెళ్లిన ఆస్తికి సంబంధించిన పత్రాలు అందజేస్తాడు. ఆ పత్రాలతో కుబేరపురం అనే గ్రామానికి వెళ్లిన ప్రతాప్‌కు అక్కడ తన తండ్రి ఓ ప్రైవేట్ బంగారు గనికి యజమాని అని తెలుస్తుంది. అయితే మరో యజమాని కుమార్తె రేణు (షాలిని కొండేపూడి) ప్రతాప్ వాటాను కూడా స్వాధీనం చేసుకుని ఆ గనిని ఓ విదేశీయుడికి విక్రయించాలని ప్రయత్నిస్తుంది. కుబేరపురంలోని చాలా మంది ప్రజలు బంగారు గనుల్లోనే జీవనం సాగిస్తుంటారు. మొదట డబ్బు కోసం మాత్రమే అక్కడికి వెళ్లిన ప్రతాప్ కూడా బంగారం తవ్వి లాభాలు పొందాలని నిర్ణయించుకుంటాడు.
వివరాలు
పాటల రూపంలో మాటలు
ఇదే సమయంలో గ్రామంలో మిగిలి ఉన్న ఒకే ఒక్క చెట్టును కూడా నరికి వేయాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆ చెట్టును కాపాడే గౌరీ (అహల్యా బమ్రూ) అతడిని అడ్డుకుంటుంది. అయితే చివరకు ఆ చెట్టు నరికివేయబడటంతో గౌరీ అనుకోకుండా కుబేరుడి గుహలో పడిపోతుంది. అక్కడి నుంచి గ్రామస్థుల స్వార్థాన్ని, ప్రకృతి విధ్వంసాన్ని తిడుతూ శాపం పెడుతుంది. మరుసటి రోజు నుంచి గ్రామంలోని ప్రతి ఒక్కరి మాటలు పాటల రూపంలో బయటకు రావడం ప్రారంభమవుతుంది. దీంతో గ్రామస్థులు తమకు ఏదైనా వ్యాధి వచ్చిందా? లేక శాపమా? అని భయాందోళనలకు గురవుతారు.
వివరాలు
విశ్లేషణ
ఆ శాపం నుంచి గ్రామస్థులు ఎలా బయటపడతారు? చెట్లు లేని ఆ గ్రామంలో మళ్లీ పచ్చదనం పుడుతుందా? ప్రతాప్ గతం ఏమిటి? గోల్డ్ మైన్స్ వెనుక అసలు కథ ఏంటి? ప్రతాప్-గౌరీ ప్రేమకథ ఎలా సాగుతుంది? బంగారాన్ని చేజిక్కించుకునేందుకు రేణు, ఆమె తండ్రి ఏం చేస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో సినిమా తెరకెక్కిస్తున్నారని ప్రకటించినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. అంతేకాదు సినిమాలో సాధారణ సంభాషణల స్థానంలో ఎక్కువ భాగం మాటలన్నీ పాటల రూపంలోనే వినిపిస్తాయని చెప్పడంతో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది.
వివరాలు
ఆసక్తికరంగా కథ
షూటింగ్ సమయంలో వీడియో కాల్స్ ద్వారా పర్యవేక్షిస్తూ దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారని వెల్లడించింది. సినిమా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌ల రూపకల్పన, ప్రీ-ప్రొడక్షన్ పనులు, వర్క్‌షాప్‌లన్నీ పూర్తి చేసిన తర్వాత సింగీతం ఈ బాధ్యతలను నాగ్ అశ్విన్‌కు అప్పగించినట్లు చిత్రబృందం తెలిపింది. ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్, విలన్ పాత్రల పరిచయం, కుబేరపురం గ్రామం, గోల్డ్ మైన్స్ నేపథ్యం చూపిస్తూ కథ ముందుకు సాగుతుంది. గౌరీ దేవుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత గ్రామంలోని ప్రతి ఒక్కరి మాటలు పాటలుగా మారిపోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
వివరాలు
ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు అద్భుతం
తొలి 20 నిమిషాల్లోనే కథను స్పష్టంగా చెప్పేసినా, ఈ శాపం ఎలా తొలగుతుంది అనే అంశంపై సస్పెన్స్‌ను బాగా కొనసాగించారు. మాటలు పాటలుగా మారడం వల్ల ఫస్ట్ హాఫ్‌లో మంచి కామెడీ పండింది. సెకండ్ హాఫ్‌లో కథ ఎమోషనల్ టోన్‌లోకి మారుతుంది. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సినిమా చివరి వరకు కూడా మాటలు పాటల రూపంలోనే కొనసాగడం ప్రత్యేకత. అయితే క్లైమాక్స్ కొంత ఓవర్ డ్రామాటిక్‌గా అనిపిస్తుంది. మనిషి ఆశ, సంపద కోసం ప్రకృతిని నాశనం చేయడం, స్వార్థం కారణంగా మానవ విలువలను మరచిపోవడం వంటి అంశాలను ప్రధాన సందేశంగా తీసుకుని దర్శకుడు కథను నడిపించారు. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం నిరాశ కలిగిస్తుంది.
వివరాలు
గ్రామ దేవుడిగా కుబేరుడు
ముఖ్యంగా రేణు, ఆమె తండ్రి మధ్య చిన్ననాటి సన్నివేశాల ద్వారా ఏదో ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ ఉన్నట్లు సూచించినా దానిపై స్పష్టత ఇవ్వలేదు. అలాగే ప్రతాప్ జైలుకు ఎందుకు వెళ్లాడు? అతని తండ్రి అసలు ఏం చేశాడు? వంటి అంశాలను కూడా వివరించలేదు. ఇక అంత పెద్ద బంగారు గనులు ఉన్నా ప్రభుత్వానికి తెలియకపోవడం, గ్రామం పూర్తిగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండటం వంటి అంశాలు వాస్తవానికి దూరంగా అనిపిస్తాయి. అయితే సినిమాటిక్ లిబర్టీగా వాటిని స్వీకరించాల్సి ఉంటుంది. కుబేరుడిని గ్రామ దేవుడిగా చూపిస్తూ రాసుకున్న సన్నివేశాలు బాగుంటాయి. 'సింగ్ గీతం' అనే టైటిల్ కథకు నేరుగా సరిపోకపోయినా, సింగీతం పేరుతో అనుసంధానం కావడం వల్ల ప్రచారపరంగా ఉపయోగపడేలా ఎంపిక చేసినట్లు అనిపిస్తుంది.
వివరాలు
దేవిశ్రీ ప్రసాద్ అసలైన హీరో
మొత్తంగా ఇది ఓ వినూత్న ప్రయోగాత్మక చిత్రం. మాటలు పాటలుగా మారే కాన్సెప్ట్‌ను ఆస్వాదించే వారికి సినిమా నచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో అసలైన హీరో ఎవరంటే దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పాలి. సినిమాలో దాదాపు మొత్తం భాగం పాటల రూపంలోనే సాగుతుంది. అలాంటి చిత్రానికి నిరంతర సంగీత ప్రవాహాన్ని అందించడం చిన్న విషయం కాదు. ప్రతి డైలాగ్‌ను లయబద్ధంగా పాటగా వినిపించేలా సంగీతం సమకూర్చడం ఎంతో క్లిష్టమైన పని. ఆ బాధ్యతను దేవిశ్రీ ప్రసాద్ సమర్థంగా నిర్వహించాడు. సినిమా విడుదల ఆలస్యం కావడానికి కూడా దేవిశ్రీ కృషే ప్రధాన కారణమని నిర్మాత నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని నిలబెట్టడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది.
వివరాలు
నటీనటుల నటన
అహల్యా బమ్రూ తన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకునేలా నటించింది. క్యూట్‌గా కనిపిస్తూనే ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించింది. కొన్ని సందర్భాల్లో హీరోయిజం కూడా చూపించింది. హీరో అయాన్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో షాలిని కొండేపూడి ఆకట్టుకుంది. తులసి తన కీలక పాత్రలో మంచి నటన కనబరిచారు. వీల్‌చైర్‌కే పరిమితమైన నెగెటివ్ పాత్రలో బెనర్జీ కూడా మెప్పించారు. రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజ్, విజయ్ దేవరకొండ, అనుదీప్ అతిథి పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. వంశీ కనిపించిన ప్రతిసారి నవ్వులు పూయించాడు. రచ్చ రవి, మహేష్, శివన్నారాయణతో పాటు మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు.