LOADING...
Southwest Monsoon: చురుగ్గా నైరుతి.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
చురుగ్గా నైరుతి.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Southwest Monsoon: చురుగ్గా నైరుతి.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు అవి విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు నుంచి మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు కూడా నైరుతి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై మరో ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావం ఉంది. ఈ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

వివరాలు 

40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గురువారం అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్సార్ కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వివరాలు 

తెలంగాణలోనూ..

ఇక తెలంగాణలోనూ వర్షాలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదేవిధంగా శుక్రవారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Advertisement