Trump-Kim: కిమ్‌తో ట్రంప్ భేటీకి ఐఏఈఏ చీఫ్ మద్దతు.. దౌత్యంపై కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య జరగనున్న భేటీకి ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రఫెల్ మారియానో గ్రాస్సీ మద్దతు తెలిపారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న దేశం,నియంతృత్వ పాలన వంటి అంశాలు ఉన్నప్పటికీ.. చర్చల మార్గాన్ని మూసివేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరువురు నేతలు సమావేశం కావడం ఎంతో ప్రాధాన్యమైందని స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర్లో కిమ్ జోంగ్ ఉన్‌ను కలవనున్నట్లు ట్రంప్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే కిమ్‌తో సమావేశానికి ట్రంప్ సిద్ధం కావడాన్ని ఆయన ప్రత్యర్థులు, విమర్శకులు తప్పుబడుతున్నారు. మరోవైపు ఉత్తర కొరియా వద్ద సుమారు 57 శక్తివంతమైన అణ్వాయుధాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
వివరాలు
దౌత్యానికి చర్చలే కీలకం
కిమ్‌తో తనకు సత్సంబంధాలు కొనసాగడం సానుకూల పరిణామమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ చేస్తున్న శాంతి ప్రయత్నాలను గ్రాస్సీ ప్రస్తావించారు.
దౌత్యం అంటే ప్రత్యర్థులతో మాట్లాడకపోవడం కాదని.. పరస్పరం కరచాలనం చేసుకుని, గౌరవప్రదంగా చర్చలు జరపడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనుగొనడమేనని వివరించారు.
'ది వాషింగ్టన్ పోస్ట్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పదవీకాలం 2026 డిసెంబర్ 31తో ముగియనుంది.
దీంతో తదుపరి ఐరాస సెక్రటరీ జనరల్ ఎంపిక ప్రక్రియలో గ్రాస్సీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
వివరాలు
2025లో గ్రాస్సీని నామినేట్ చేసిన అర్జెంటీనా
అర్జెంటీనాకు చెందిన 65 ఏళ్ల రఫెల్ గ్రాస్సీని ఆ దేశం 2025 నవంబర్ 26న ఐరాస సెక్రటరీ జనరల్ పదవికి నామినేట్ చేసింది.
గత ఆరేళ్లుగా ఐఏఈఏ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్న ఆయనకు అణు దౌత్యంలో విస్తృత అనుభవం ఉంది.
ఇరాన్ అణు ఒప్పందానికి సంబంధించిన చర్చల్లో గ్రాస్సీ కీలకంగా వ్యవహరించారు.
అలాగే ఉక్రెయిన్‌లోని జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంలో ఐఏఈఏ బృందాన్ని మోహరించడంలోనూ ఆయన ముఖ్యపాత్ర పోషించారు.
వివరాలు
ఎనిమిది మంది అభ్యర్థుల మధ్య పోటీ
ఐరాస సెక్రటరీ జనరల్ పదవికి ప్రస్తుతం ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఈ ఎంపికలో ఐరాస భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాల మద్దతు అత్యంత కీలకం.
గ్రాస్సీ అభ్యర్థిత్వంపై రష్యా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. వాస్తవ ప్రపంచంలోని శాంతి, భద్రతకు సంబంధించిన సమస్యలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం తనకే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.