LOADING...
Year Ender 2025: ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘటనలు.. 2025లో గ్లోబల్ దిశను  మార్చేసిన కీలక పరిణామాలు ఇవే!
2025లో గ్లోబల్ దిశను  మార్చేసిన కీలక పరిణామాలు ఇవే!

Year Ender 2025: ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘటనలు.. 2025లో గ్లోబల్ దిశను  మార్చేసిన కీలక పరిణామాలు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

యుద్ధ మేఘాలు, దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు, ఆర్థిక ఒడిదుడుకులు.. ఇలా 2025 సంవత్సరం ప్రపంచ దేశాలను ఓ కీలక మలుపు వద్ద నిలిపింది. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతల నుంచి, అమెరికాలో నూతన అధ్యక్షుడి విధాన నిర్ణయాల వరకూ ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరో ఏడాది ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, 2025 ప్రపంచానికి ఎన్నో సవాళ్లు, మార్పులను పరిచయం చేసింది. అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పిడి, ఆసియా దేశాల్లో రాజకీయ అశాంతి, మధ్య ప్రాచ్యంలో యుద్ధ వాతావరణం ఈ ఏడాది ప్రపంచాన్ని ఆలోచింపజేశాయి. ఆ ముఖ్య సంఘటనలు ఇవే...

వివరాలు 

అమెరికా పగ్గాలు చేపట్టిన ట్రంప్ 

నవంబర్ 2024లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్, 2025 జనవరిలో అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన అధికారంలోకి రావడంతో అమెరికా విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వాణిజ్య సుంకాలు, వలస విధానాలకు సంబంధించిన ఆయన నిర్ణయాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

వివరాలు 

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత - 'ఆపరేషన్ సిందూర్' 

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం మే 7న తెల్లవారుజామున 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి.

Advertisement

వివరాలు 

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం 

మధ్య ప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు జరపగా, ఇరాన్ కూడా గట్టిగా ప్రతిస్పందించింది. పరిస్థితి యుద్ధానికి దారి తీసే స్థాయికి చేరినప్పటికీ, అమెరికా జోక్యంతో చివరకు కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. ఇదిలా ఉండగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఎలాంటి పరిష్కారం లేకుండానే కొనసాగుతూ అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా మారింది.

Advertisement

వివరాలు 

వాణిజ్య యుద్ధం.. ఆసియాలో అశాంతి 

అమెరికా, చైనా మధ్య సాంకేతికత, వాణిజ్య రంగాల్లో పోటీ మరింత ఉద్ధృతమైంది. చైనా నుంచి దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించడంతో ప్రపంచ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు దక్షిణాసియా దేశాల్లో నిరసనలు భగ్గుమన్నాయి. బంగ్లాదేశ్‌లో జరిగిన కాల్పుల ఘటనలు, నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాల పతనానికి కారణమయ్యాయి. పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. 2025 సంవత్సరం యుద్ధాలు, ఆర్థిక మార్పులు, రాజకీయ అనిశ్చితి మధ్య ప్రపంచాన్ని కుదిపేసింది. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లేకుండానే, మరెన్నో సవాళ్లను ముందుకు నెట్టుతూ ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంది.

Advertisement