Loading...
Trump: ఇరాన్‌ను ఏకాకి చేసేందుకు ట్రంప్ 'ఆర్థిక యుద్ధం'.. మద్దతు ఇచ్చే దేశాలకు హెచ్చరిక
మద్దతు ఇచ్చే దేశాలకు హెచ్చరిక

Trump: ఇరాన్‌ను ఏకాకి చేసేందుకు ట్రంప్ 'ఆర్థిక యుద్ధం'.. మద్దతు ఇచ్చే దేశాలకు హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
08:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఇక టెహ్రాన్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోకుండా.. ఇరాన్‌కు ఆర్థికంగా, వాణిజ్యపరంగా, ఇతర మార్గాల్లో అండగా నిలిచే దేశాలు, సంస్థలపైనా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇరాన్‌కు డబ్బు అందించడం, ఆ దేశంతో వ్యాపారం చేయడం, చమురు తరలింపులో సహకరించడం వంటి చర్యలకు పాల్పడితే భారీ ఆర్థిక మూల్యం చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి మరింత దూరం చేసేలా గతంలో ఎన్నడూ లేనంత కఠిన చర్యలకు అమెరికా సిద్ధమవుతున్నట్లు ట్రంప్‌ సంకేతాలిచ్చారు. ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో చేసిన పోస్టులో ఈ విషయాలను వెల్లడించారు.

వివరాలు 

ఇరాన్‌కు సహకారం అందించే మార్గాల విషయంలోనూ ట్రంప్‌ హెచ్చరికలు జారీ

ఇరాన్‌కు ఆర్థిక సంస్థలు, వ్యాపార సంస్థలు, విమానాశ్రయాలు లేదా ప్రభుత్వ సంస్థలు ఎలాంటి సహాయం చేసినా.. సంబంధిత దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అయితే ఏయే దేశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా వెల్లడించలేదు.

ఇరాన్‌కు సహకారం అందించే మార్గాల విషయంలోనూ ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు.

అక్రమ చమురు రవాణా, ఆర్థిక స్వాప్‌ ఒప్పందాలు,నగదు బదిలీలు, ఎక్స్ఛేంజ్‌ హౌస్‌లు, నౌకల రిజిస్ట్రీలు,ఫ్రంట్‌ కంపెనీల ద్వారా టెహ్రాన్‌కు మద్దతు ఇచ్చినా అమెరికా చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చారు.

దీంతో ఇరాన్‌తో నేరుగా వ్యాపారం చేసే సంస్థలతో పాటు.. పరోక్షంగా ఆ దేశానికి ఆర్థిక సహాయం అందించే వ్యవస్థలపైనా అమెరికా నిఘా పెట్టే అవకాశం కనిపిస్తోంది.

వివరాలు 

ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది: ట్రంప్  

ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు తమ ప్రభుత్వం ఇప్పటికే అనేక అవకాశాలు ఇచ్చిందని ట్రంప్‌ తెలిపారు.

అయితే టెహ్రాన్‌ వాటిని సద్వినియోగం చేసుకోలేదని ఆరోపించారు.

ఇప్పుడు ఇరాన్‌పై అపూర్వ స్థాయిలో ఆర్థిక ఒత్తిడి,అంతర్జాతీయ ఒంటరితనం తీసుకొచ్చే చర్యలను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో అమెరికా మిత్రదేశాలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఇరాన్‌ సైనిక సామర్థ్యం ఇప్పటికే గణనీయంగా దెబ్బతిన్నదని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఆ దేశ నౌకాదళం ధ్వంసమైందని, వైమానిక దళం బలహీనపడిందని, సైనిక ఉత్పత్తి కేంద్రాలు భారీగా దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు.

అదే సమయంలో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని తెలిపారు.

కొత్త ఆంక్షలు,ఆర్థిక చర్యలు అమల్లోకి వస్తే టెహ్రాన్‌ అంతర్జాతీయంగా కార్యకలాపాలు కొనసాగించే సామర్థ్యం మరింత తగ్గుతుందని అన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రపంచ వాణిజ్య వ్యవస్థలోనూ కీలక మార్పులు

ఇరాన్‌ అణు కార్యక్రమంపై కూడా ట్రంప్‌ మరోసారి తన కఠిన వైఖరిని స్పష్టం చేశారు.

ఇరాన్‌ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకుండా చూడటమే తమ విధానమని పునరుద్ఘాటించారు.

ట్రంప్‌ తాజా హెచ్చరికలతో ఇప్పుడు చర్చ కేవలం ఇరాన్‌పైనే పరిమితం కాలేదు.

టెహ్రాన్‌కు అండగా నిలిచే దేశాలు, సంస్థలపై అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది.

ఇరాన్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను కొనసాగించే దేశాలపై అమెరికా చర్యలు ప్రారంభిస్తే.. ప్రపంచ వాణిజ్య వ్యవస్థలోనూ కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

దీంతో ఇరాన్‌ను ఒంటరి చేయాలన్న ట్రంప్‌ వ్యూహం.. ఆ దేశానికి మద్దతుగా నిలిచే వారిని కూడా లక్ష్యంగా చేసుకునే స్థాయికి చేరిందా? అనే చర్చ అంతర్జాతీయంగా మొదలైంది.

ADVERTISEMENT