LOADING...
Osman Hadi: 'న్యాయం చేయకపోతే పారిపోవాల్సిందే'.. యూనస్‌కు హాదీ సోదరుడు వార్నింగ్
'న్యాయం చేయకపోతే పారిపోవాల్సిందే'.. యూనస్‌కు హాదీ సోదరుడు వార్నింగ్

Osman Hadi: 'న్యాయం చేయకపోతే పారిపోవాల్సిందే'.. యూనస్‌కు హాదీ సోదరుడు వార్నింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజకీయ అనిశ్చితితో కుదేలవుతున్న బంగ్లాదేశ్‌లో రోజురోజుకూ పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. యువ రాజకీయ నేత ఉస్మాన్ హాదీ హత్య వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందన్న ఆరోపణలు తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. ఇదే సమయంలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించిన అంశంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా యూనస్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది. ఈ పరిణామాలన్నీ కలిసి దేశంలో ఉద్రిక్త వాతావరణాన్ని మరింత పెంచుతున్నాయి.

వివరాలు 

'పారిపోవాల్సి వస్తుంది… జాగ్రత్త' 

ఇంకిలాబ్ మోంచో నేత, యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో ఇటీవల బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై హాదీ సోదరుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హాదీ హత్యలో యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ''ఉస్మాన్ హాదీని మీరే హత్య చేశారు. ఈ ఘటనను కారణంగా చూపి వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలను రద్దు చేయాలనే కుట్ర జరుగుతోంది. నా సోదరుడి హత్యపై వేగంగా దర్యాప్తు చేసి దోషులను పట్టుకోవాలి. హాదీకి న్యాయం జరగకపోతే... మీరు కూడా ఏదో ఒకరోజు బంగ్లాదేశ్‌ను వీడి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త..'' అని ఆయన హెచ్చరించారు.

వివరాలు 

అమెరికా ఆందోళన 

గతేడాది విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హాదీ, షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో ప్రధానంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ ఉద్యమం ఫలితంగా హసీనా దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది. అదే నేపథ్యాన్ని గుర్తు చేస్తూ హాదీ సోదరుడు యూనస్‌ను పరోక్షంగా హెచ్చరించినట్లు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదిలా ఉండగా, మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అవకాశం కోల్పోయింది. ఈ నిర్ణయంపై అమెరికా చట్టసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు బంగ్లాదేశ్ ప్రజలకు ఉందని వారు స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

ఆమెను తొలగిస్తారా, లేదా? 

అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో ఎన్నికలు నిర్వహించే దిశగా తాత్కాలిక ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. అవామీ లీగ్‌పై విధించిన నిషేధాన్ని తిరిగి సమీక్షించాలని కూడా అమెరికా చట్టసభ్యులు కోరారు. మరోవైపు, బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల పలు మీడియా సంస్థలపై ఆందోళనకారులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో మీడియా సంస్థకు కూడా బెదిరింపులు అందాయి. గ్లోబల్ టీవీ హెడ్ నాజ్నిన్ మున్నీని పదవి నుంచి తొలగించాలని, అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు బెదిరించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో దేశంలో మీడియా స్వేచ్ఛపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement