Zelensky: టేకాఫ్ సమయంలో జెలెన్‌స్కీ విమానానికి దగ్గరగా డ్రోన్.. తప్పిన ప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న విమానానికి త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. మాల్డోవా నుంచి విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ డ్రోన్ అత్యంత సమీపంలోకి వచ్చింది. కొద్దిగా అటూఇటుగా జరిగి ఉంటే విమానాన్ని ఢీకొట్టే పరిస్థితి ఉండేదని నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ వెల్లడించారు. నార్వే రాజు కింగ్ హెరాల్డ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు జెలెన్‌స్కీ మాల్డోవా నుంచి రాజధాని ఓస్లోకు బయల్దేరారు. ఈ ప్రయాణ సమయంలోనే డ్రోన్ ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న వేళ డ్రోన్ ముప్పు కారణంగా మాల్డోవా అధికారులు కొంతసేపు గగనతలాన్ని మూసివేశారు. దీంతో జెలెన్‌స్కీ విమానంతో పాటు మరికొన్ని విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వివరాలు
మాల్డోవా భూభాగంలో కూలిపోయిన డ్రోన్
ఈ ఘటనపై నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ మాట్లాడుతూ.. మాల్డోవా నుంచి బయల్దేరే సమయంలో జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న విమానం డ్రోన్ బారిన పడకుండా తృటిలో తప్పించుకుందని తెలిపారు.
అయితే, డ్రోన్ విమానానికి ఎంత సమీపంలోకి వచ్చిందో, ఈ విషయం తనకు ఎవరి ద్వారా తెలిసిందో ఆయన చెప్పలేదు.
మరోవైపు మాల్డోవా అధికారులు మాత్రం డ్రోన్ ముప్పు కారణంగానే గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు.
రష్యాకు చెందినదిగా భావిస్తున్న డ్రోన్ మాల్డోవా గగనతలంలోకి ప్రవేశించిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఆతర్వాత అది మాల్డోవా భూభాగంలో కూలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈపరిణామాల నేపథ్యంలో పరిస్థితిని నిర్ధారించిన తర్వాతే జెలెన్‌స్కీ విమానం టేకాఫ్‌కు అనుమతించారు.
అయితే జెలెన్‌స్కీ ప్రయాణం ఎలాంటి ప్రమాదం లేకుండా కొనసాగింది.
వివరాలు
కెనడా పర్యటనకు జెలెన్‌స్కీ
ఆయన విమానం నార్వే రాజధాని ఓస్లోలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
అనంతరం కింగ్ హెరాల్డ్ వి అంత్యక్రియలకు జెలెన్‌స్కీ హాజరయ్యారు.
ఓస్లో పర్యటనలో భాగంగా జెలెన్‌స్కీ నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌తో పాటు ఇతర మంత్రులు,రక్షణ రంగానికి చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు.
రష్యాతో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అవసరమైన సైనిక, వైమానిక రక్షణ సహకారంపై చర్చించారు.
యూరప్ గగనతల భద్రతకు సంబంధించిన ఫ్రెయా(FREYJA)కార్యక్రమంపైనా చర్చలు జరిగినట్లు సమాచారం.
నార్వే పర్యటన ముగిసిన అనంతరం జెలెన్‌స్కీ కెనడా పర్యటనకు బయల్దేరారు.
మొత్తంగా ఈ ఘటనతో జెలెన్‌స్కీ విమాన భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
అయితే విమానానికి ఎలాంటి నష్టం జరగలేదని,ప్రయాణికులకు కూడా ఎలాంటి ప్రమాదం సంభవించలేదని సమాచారం.