ఏప్రిల్ 1 నుంచి 18% పెరగనున్న ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే టోల్ పన్ను
దేశంలోని మొట్టమొదటి యాక్సెస్-నియంత్రిత రహదారి ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల టోల్ ఏప్రిల్ 1 నుండి 18 శాతం పెరుగుతుందని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) అధికారులు తెలిపారు. 2004 ఆగస్టు 9 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా, ఏటా ఆరు శాతం టోల్ పెరుగుతున్నప్పటికీ, ప్రతి మూడేళ్ల తర్వాత 18 శాతం చొప్పున ఇది అమలు అవుతుందని సీనియర్ MSRDC అధికారి తెలిపారు. కార్లు, జీపుల వంటి నాలుగు చక్రాల వాహనాలకు ప్రస్తుతం ఉన్న Rs. 270కి బదులుగా Rs. 320, మినీ-బస్సు, టెంపోల వంటి వాహనాలకు ప్రస్తుతం ఉన్న Rs. 420కి బదులుగా Rs. 495గా కొత్త టోల్ వసూలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ రహదారిపై ఐదు టోల్ ప్లాజాల దగ్గర టోల్ వసూలు అవుతుంది
టూ-యాక్సిల్ ట్రక్కుల టోల్ ప్రస్తుతం Rs. 585 నుండి Rs. 685కి పెరుగుతుంది. బస్సులకు Rs. 797 నుండి Rs. 940కి పెరుగనుంది. త్రీ-యాక్సిల్ ట్రక్కులు Rs. 1,380కి బదులుగా Rs. 1,630, మల్టీ-యాక్సిల్ ట్రక్కులు, మెషినరీ-వాహనాలు ప్రస్తుత Rs. 1,835కి బదులుగా Rs. 2,165 చెల్లించాలి. ఈ టోల్ పెంపు 2030 వరకు అలాగే ఉంటుందని అధికారులు తెలిపారు. దాదాపు 95 కి.మీ పొడవు, ఆరు లేన్ల ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వే 2002లో ప్రారంభమైంది. ఐదు టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూలు అవుతుంది, వీటిలో ఖలాపూర్, తలేగావ్‌లు ప్రధానమైనవి. ప్రతిరోజు దాదాపు 1.5 లక్షల వాహనాలు ఎక్స్‌ప్రెస్‌వేను ఉపయోగిస్తాయి.