Mercedes-Benz S-Class PHEV: భారత్‌లో 2026 మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ విడుదల.. ఎంతంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లో 2026 S-క్లాస్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV)ను అధికారికంగా విడుదల చేసింది. S 450 e Launch Edition పేరుతో వచ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ సెడాన్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.20 కోట్లు కాగా,ప్రత్యేక 'మానుఫాక్టూర్ ఎడిషన్'(Manufaktur Edition) ధర రూ.2.38 కోట్లుగా నిర్ణయించారు. ఈ కారు బుకింగ్‌లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది నాలుగో త్రైమాసికం (Q4)లో డెలివరీలు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త S 450 eలో 3.0 లీటర్ M256 Evo ఇన్‌లైన్-సిక్స్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ను జోడించారు.
వివరాలు
435 హెచ్‌పీ పవర్,680 ఎన్ఎం టార్క్
ఈ హైబ్రిడ్ వ్యవస్థ కలిపి 435 హెచ్‌పీ పవర్,680 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సాధారణ S 450 4MATIC పెట్రోల్ మోడల్ కంటే మరింత శక్తివంతంగా ఉండటం విశేషం. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఈ కారు అందుబాటులోకి వచ్చింది. 22 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీతో కూడిన ఈ లగ్జరీ సెడాన్ పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో సుమారు 115 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. నగర ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలకు పెట్రోల్ ఇంజిన్ అవసరం లేకుండానే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. గంటకు గరిష్ఠంగా 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగల ఈ కారు, 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.7 సెకన్లలో అందుకుంటుంది.
వివరాలు
ఫీచర్లు
డిజైన్ పరంగా కూడా కొత్త S-క్లాస్‌లో పలు మార్పులు చేశారు. మైక్రో-ఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన కొత్త డిజిటల్ హెడ్‌ల్యాంప్‌లు, వెలిగే రేడియేటర్ గ్రిల్, త్రీ-డైమెన్షనల్ క్రోమ్ స్టార్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెనుక భాగంలో కొత్త సిగ్నేచర్ స్టార్ టెయిల్ ల్యాంప్‌లను అమర్చారు. ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త MBUX సూపర్‌స్క్రీన్‌తో పాటు AI ఆధారిత "Hey Mercedes" వర్చువల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్ ఆధారిత నావిగేషన్, మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్ వంటి అత్యాధునిక సాంకేతికతలను అందించారు. ప్రయాణికులతో సహజ సంభాషణ జరిపే సామర్థ్యం ఈ వ్యవస్థ ప్రత్యేకత.
వివరాలు
భద్రతకు పెద్దపీట వేసిన మెర్సిడెస్
భద్రతకు పెద్దపీట వేసిన మెర్సిడెస్, కొత్త S-క్లాస్‌లో అత్యాధునిక అడాప్టివ్ సేఫ్టీ సిస్టమ్‌తో పాటు 15 ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రీ-సేఫ్ ఇంపల్స్ బెల్ట్ ప్రీటెన్షనర్లు వంటి ఫీచర్లను అందించింది. అలాగే స్టాండర్డ్ ఎయిర్‌మాటిక్ ఎయిర్ సస్పెన్షన్, రియర్ యాక్సిల్ స్టీరింగ్, ఇతర మెర్సిడెస్ కార్ల నుంచి అందే Car-to-X సమాచారంతో రోడ్డు పరిస్థితులను ముందుగానే గుర్తించి సస్పెన్షన్‌ను సర్దుబాటు చేసే స్మార్ట్ టెక్నాలజీని కూడా ఇందులో పొందుపరిచారు. లగ్జరీ, పనితీరు, అధునాతన సాంకేతికత, పర్యావరణ హితమైన హైబ్రిడ్ వ్యవస్థల సమ్మేళనంగా 2026 మెర్సిడెస్-బెంజ్ S 450 e భారత ప్రీమియం కార్ల మార్కెట్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పనుందని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.