Chinese EV: 130 కి.మీ వేగంతో టన్నెల్‌లో 360° లూప్.. చైనా ఈవీ సంచలన స్టంట్!
ఈ వార్తాకథనం ఏంటి
చైనాకు చెందిన డోంగ్‌ఫెంగ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్ వోయా.. కొత్త ఎలక్ట్రిక్ ఎఫ్‌యూవీ 'ప్యాషన్ ఎస్'ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. చైనాలో ఈ మోడల్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటి ధరలు 2,29,900 యువాన్ (సుమారు 33,800 డాలర్లు) నుంచి 2,79,900 యువాన్ (సుమారు 41,200 డాలర్లు) వరకు ఉన్నాయి. అయితే ఈ కారు విడుదల కంటే.. దాని ప్రమోషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. వోయా ప్యాషన్ ఎస్ చేసిన ఓ సంచలన స్టంట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రత్యేకంగా రూపొందించిన టన్నెల్‌లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ తలకిందులుగా ప్రయాణిస్తూ ఏకంగా 360 డిగ్రీల బారెల్ రోల్‌ను పూర్తి చేసింది.
వివరాలు
మెర్సిడెస్ స్టంట్‌కు చైనా వెర్షన్!
వోయా చేసిన ఈ స్టంట్ 2010లో మెర్సిడెస్ బెంజ్ నిర్వహించిన ఓ ప్రసిద్ధ ప్రకటనను గుర్తు చేస్తోంది.
అప్పట్లో ఫార్ములా వన్ దిగ్గజం మైఖేల్ షూమాకర్ మెర్సిడెస్ ఎస్‌ఎల్‌ఎస్ ఏఎంజీ కారును భూగర్భ టన్నెల్ పైకప్పుపై నడిపినట్లు ఓ ప్రకటనలో చూపించారు.
ఆ స్టంట్ నిజంగానే జరిగిందా? అనే దానిపై అప్పట్లో చాలా చర్చ జరిగింది. ఇప్పుడు డోంగ్‌ఫెంగ్ అదే తరహా విన్యాసాన్ని ఆధునిక ఎలక్ట్రిక్ వాహనంతో చేసి చూపించింది.
వోయా విడుదల చేసిన 'వన్-టేక్' వీడియోలో ప్యాషన్ ఎస్ ప్రత్యేక టెస్ట్ ఫెసిలిటీలో టన్నెల్ లోపలి గోడలపై వేగంగా దూసుకెళ్లి తలకిందులుగా ప్రయాణించడం కనిపిస్తుంది.
ఈ స్టంట్‌ను చైనాలోని హుబే ప్రావిన్స్‌లో ఉన్న ప్రత్యేక పరీక్షా కేంద్రంలో నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది.
వివరాలు
గంటకు 130 కిలోమీటర్ల వేగం అవసరం
ఈ విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు వాహనం గంటకు సుమారు 130 కిలోమీటర్ల వేగంతో టన్నెల్‌లోకి ప్రవేశించాలని ఇంజినీర్లు లెక్కించారు. అదే సమయంలో స్టీరింగ్‌ను ఖచ్చితంగా 16 డిగ్రీల కోణంలో ఉంచాల్సి వచ్చింది.
అంత వేగంతో ప్రయాణించినప్పుడు ఏర్పడే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కారణంగా కారు టన్నెల్ లోపలి ఉపరితలానికి గట్టిగా అంటుకుని ఉంటుంది.
దీంతో వాహనం తలకిందులుగా ఉన్నప్పటికీ టన్నెల్ గోడపై ప్రయాణించగలిగింది. అనంతరం రెండో ర్యాంప్ వద్దకు చేరుకుని సురక్షితంగా నేలపైకి వచ్చి ఆగింది.
అయితే వేగం గణనీయంగా తగ్గితే వాహనం పట్టును కోల్పోయి కిందపడిపోయే ప్రమాదం ఉందని కంపెనీ తెలిపింది.
వివరాలు
డిజైన్ కూడా అదిరేలా..
టన్నెల్ పైకప్పుపై కనిపించిన పలు టైర్ మార్కులను బట్టి ఈ స్టంట్ విజయవంతం కావడానికి ముందు ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రయత్నించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వోయా ప్యాషన్ ఎస్ కేవలం స్టంట్‌తోనే కాకుండా డిజైన్, టెక్నాలజీ పరంగానూ ఆకట్టుకునేలా ఉంది. ముందు భాగంలో వోయా 'కున్‌పెంగ్ వింగ్' డిజైన్ లాంగ్వేజ్‌ను ఉపయోగించారు.
ఇల్యూమినేటెడ్ లైటింగ్ ఎలిమెంట్లు, 0.24 డ్రాగ్ కోఎఫిషియెంట్‌తో ఏరోడైనమిక్ బాడీని అందించారు. ఫాస్ట్‌బ్యాక్ తరహా ఎస్‌యూవీ 21 అంగుళాల వీల్స్‌పై నడుస్తుంది.
దీని పొడవు 5,050 మిల్లీమీటర్లు కాగా.. వీల్‌బేస్ 3,000 మిల్లీమీటర్లుగా ఉంది.
వివరాలు
లోపల డిజిటల్ ఫీచర్లే హైలైట్
క్యాబిన్‌లో డిజిటల్ ఫస్ట్ లేఅవుట్‌ను తీసుకొచ్చారు. డ్యాష్‌బోర్డ్‌పై రెండు 15.6 అంగుళాల సెంట్రల్ డిస్‌ప్లేలు ఉన్నాయి.
వీటితో పాటు 29 అంగుళాల ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లే, 8.8 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.
ఈ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ హువావేకు చెందిన హార్మనీ స్పేస్ 5.2 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఏఐ ఆధారిత వాయిస్ కంట్రోల్ సదుపాయం కూడా ఇందులో ఉంది.
వివరాలు
637 హెచ్‌పీ వరకు పవర్
ప్యాషన్ ఎస్‌లో రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఉన్నాయి. సింగిల్ రియర్ మోటార్ వెర్షన్ 402 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ ఏకంగా 637 హెచ్‌పీ పవర్‌ను అందిస్తుంది. భద్రత, డ్రైవింగ్ సౌకర్యం కోసం అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)ను కూడా అందించారు.
ఇందులో నెక్స్ట్ జనరేషన్ లిడార్ సెన్సర్, ఐదు 4డీ మిల్లీమీటర్-వేవ్ రాడార్లు, హువావే కియాంకున్ ADS 5.0 ప్లాట్‌ఫామ్ ఉన్నాయి.
వీటి ద్వారా నగరాలు, హైవేలపై నావిగేషన్ అసిస్ట్, ఎండ్-టు-ఎండ్ పార్కింగ్ వంటి అధునాతన డ్రైవింగ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
మొత్తంగా డిజైన్, పవర్, టెక్నాలజీతో పాటు సంచలనాత్మక స్టంట్‌తో వోయా ప్యాషన్ ఎస్ చైనా ఈవీ మార్కెట్లో ప్రత్యేకంగా నిలిచింది.