7 seater cars : భారత్ మార్కెట్‌లోకి 5 కొత్త 7-సీటర్ కార్లు.. ఫ్యామిలీలకు గ్రాండ్ గిఫ్ట్
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో 7-సీటర్ కార్లకు ఉన్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, విలాసవంతమైన సదుపాయాలతో ఈ ఏడాది మరియు వచ్చే ఏడాదిలో పలు కొత్త మోడళ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. ముఖ్యంగా వోక్స్‌వ్యాగన్, MG మోటార్, నిస్సాన్, రెనాల్ట్ వంటి ప్రముఖ సంస్థలు తమ 7-సీటర్ ఎస్‌యూవీలను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ మోడళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Details
1) ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ ఆర్ లైన్
ఫోక్స్‌వ్యాగన్ నుంచి రాబోతున్న అత్యంత ఖరీదైన ఫ్లాగ్‌షిప్ మోడల్ 'టైరాన్ ఆర్ లైన్'. ఇప్పటికే భారత్‌లో దీని అసెంబ్లింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాబోయే కొన్ని వారాల్లోనే ఇది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అంచనా ధర: రూ. 45 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). ప్రత్యేకతలు: గ్లోబల్ టైగన్ మోడల్‌ను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ ఎస్‌యూవీలో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. 4-వీల్ డ్రైవ్ (4WD) వ్యవస్థ స్టాండర్డ్ ఫీచర్‌గా రానుంది.
Details
2) నిస్సాన్ గ్రావిటే
రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందిన 'గ్రావిటే'ను Nissan ఫిబ్రవరి 17, 2026న విడుదల చేయనుంది. భారత్‌లోనే తయారవుతున్న ఈ కారు ధర పరంగా పోటీగా ఉండే అవకాశం ఉంది. దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ కార్లలో ఒకటిగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి. డిజైన్: ట్రైబర్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన, మరింత స్టైలిష్ లుక్‌తో రానుంది. ఇంజిన్ ఆప్షన్లు: 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి.
Details
3) నిస్సాన్ టెక్టాన్ ఆధారిత 7-సీటర్
నిస్సాన్ నుంచి మిడ్-సైజ్ ఎస్‌యూవీగా 'టెక్టాన్' రానుంది. ఇది కొత్త రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫారమ్‌ను పంచుకుంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీని 7-సీటర్ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుందని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ తదితర ఫీచర్లు టెక్టాన్ మాదిరిగానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ, అదనపు సదుపాయాలు కూడా కలపనున్నట్లు సమాచారం.
Details
4) కొత్త జనరేషన్ రెనాల్ట్ డస్టర్ 7-సీటర్
రెనాల్ట్ అభిమానులు ఎదురుచూస్తున్న కొత్త జనరేషన్ డస్టర్ ధరలను వచ్చే నెలలో ప్రకటించనున్నారు. ఏప్రిల్ 2026 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. ఇదే ప్లాట్‌ఫారమ్ ఆధారంగా 7-సీటర్ వెర్షన్‌ను కూడా కంపెనీ సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న 'బోరియల్' మోడల్ తరహాలో ఈ 7-సీటర్ రూపుదిద్దుకోనుంది. పూర్తిస్థాయి 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా దీనిని తయారు చేస్తున్నారు. హైబ్రిడ్ వెర్షన్ ధరలను ఈ ఏడాది చివర్లో ప్రకటించే అవకాశం ఉంది.