LOADING...
 EV batteries: ఈవీ బ్యాటరీలకు ఆధార్‌ తరహా నెంబర్.. కేంద్రం కీలక ప్రతిపాదన!
ఈవీ బ్యాటరీలకు ఆధార్‌ తరహా నెంబర్.. కేంద్రం కీలక ప్రతిపాదన!

 EV batteries: ఈవీ బ్యాటరీలకు ఆధార్‌ తరహా నెంబర్.. కేంద్రం కీలక ప్రతిపాదన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2026
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీలకు ఆధార్‌ నంబర్‌ తరహాలో ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యను ప్రవేశపెట్టాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. బ్యాటరీల ఎండ్‌-టు-ఎండ్ ట్రాకింగ్‌ను సాధించడం, అలాగే సమర్థవంతమైన రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడమే ఈ విధానానికి ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, బ్యాటరీ తయారీదారు లేదా దిగుమతిదారు మార్కెట్‌లోకి తీసుకువచ్చే ప్రతి బ్యాటరీ ప్యాక్‌కు 21 అక్షరాలతో కూడిన ప్రత్యేకమైన 'బ్యాటరీ ప్యాక్ ఆధార్ నంబర్‌' (Battery Pack Aadhaar Number - BPAN)ను తప్పనిసరిగా కేటాయించాలి. ఈ గుర్తింపు సంఖ్య బ్యాటరీపై స్పష్టంగా కనిపించేలా, తొలగించలేని విధంగా ఉండాలని సూచించింది.

Details

జవాబుదారీతనం, స్థిరత్వం పెరుగుతాయి

బ్యాటరీ తయారీలో ఉపయోగించే ముడిపదార్థాల దశ నుంచి వినియోగం, చివరికి రీసైక్లింగ్ లేదా రీపర్పోజింగ్‌ వరకు జరిగే అన్ని దశలకు సంబంధించిన సమాచారాన్ని ఈ BPAN ద్వారా భద్రపరచనున్నారు. రీసైక్లింగ్ లేదా రీపర్పోజింగ్‌ ప్రక్రియ వల్ల బ్యాటరీ లక్షణాల్లో మార్పులు వస్తే, దానికి కొత్త BPANను కేటాయించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విధానం అమలుతో బ్యాటరీ ఎకోసిస్టమ్‌లో పారదర్శకత, జవాబుదారీతనం, స్థిరత్వం పెరుగుతాయని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. బ్యాటరీ పనితీరు, పర్యావరణంపై దాని ప్రభావాన్ని కూడా కచ్చితంగా ట్రాక్ చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. ముఖ్యంగా సెకండ్‌-లైఫ్ వినియోగం, నిబంధనల అమలు, రీసైక్లింగ్‌ ప్రక్రియలో సమర్థత పెంచడంలో BPAN కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Details

ఈవీ బ్యాటరీలకు ప్రాధాన్యం

భారత్‌లో లిథియం-ఐయాన్ బ్యాటరీల మొత్తం డిమాండ్‌లో సుమారు 80 నుంచి 90 శాతం వరకు విద్యుత్‌ వాహనాల నుంచే వస్తున్న నేపథ్యంలో, మొదటి దశలో ఈవీ బ్యాటరీలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అలాగే 2 kWhకు పైబడిన ఇండస్ట్రియల్‌ బ్యాటరీలకు కూడా ఈ నిబంధనలు వర్తింపజేయనున్నారు. ఈ విధానాన్ని ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కమిటీ (AISC)కు అనుసంధానమైన ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌ (AIS) ద్వారా అమలు చేయనున్నారు. ఈ కమిటీలో బ్యాటరీ తయారీదారులు, ఈవీ తయారీదారులు, రీసైక్లర్లు, టెస్టింగ్‌ ఏజెన్సీలు, రెగ్యులేటరీ బాడీల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ప్రత్యేక గుర్తింపు సంఖ్య వ్యవస్థ అమలుతో నకిలీ బ్యాటరీలను అరికట్టడం కూడా సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement