TATA Charging Stations: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అదనంగా 70 టాటా ఛార్జింగ్ స్టేషన్లు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచేందుకు టాటా పవర్ సన్మాహాలను మొదలు పెట్టింది. ప్రస్తుతం తెలంగాణలో 130, ఆంధ్రప్రదేశ్‌లో 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. డిసెంబర్ నాటికి కొత్తగా మరో 70 వరకు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు టాటా పవర్ ఈవీ ఛార్జింగ్ అధిపతి వీరేంద్ర గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 400లకు పైగా నగరాలు, పట్టణాల్లో కలిపి 4800 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని, 2028 నాటికి వాటి సంఖ్య 25000 వరకు చేరుతుందని ఆయన వెల్లడించారు.
సరుకు రవాణా వాహనాలకు ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్లు
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి, కరీంనగర్,బెంగళూరుకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారుల్లో తమ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయని, విద్యుత్ కార్ల యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రెస్టారెంట్లతో పాటు, పెట్రోలు బంకుల్లోనూ వీటిని ఏర్పాటు చేశామని, ఇక గృహ సముదాయాల్లోనూ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పలువురు డెవలపర్లు, స్థిరాస్థి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నమని వీరేంద్ర గోయల్ తెలిపారు. ఇక సరుకు రవాణా వాహనాలకూ ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్లు తీసుకొస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా నెలకు 17వేల కొత్త వాహనదారులు తమ ఛార్జింగ్ స్టేషన్లను వినియోగించుకుంటున్నారని వీరేంద్ర చెప్పుకొచ్చాడు.