Bajaj Pulsar 25 Years: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? ఇదీ పూర్తి చరిత్ర!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రోడ్లపై స్పోర్టీ లుక్, మంచి పవర్‌తో ఆకట్టుకునే బైక్‌ల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేర్లలో బజాజ్ పల్సర్ ఒకటి. రెండు దశాబ్దాలకు పైగా భారత యువతలో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న పల్సర్.. కాలానుగుణంగా డిజైన్, ఇంజిన్, టెక్నాలజీ, ఫీచర్లలో ఎన్నో మార్పులు చేసుకుంది. 2001లో పల్సర్ 150, పల్సర్ 180 మోడళ్లతో ప్రారంభమైన ఈ ప్రయాణం.. ప్రస్తుతం ఆధునిక N160 4V వంటి మోడళ్ల వరకు చేరుకుంది. మరి 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎలా మారింది? దాని ప్రయాణంలో కీలకమైన మలుపులు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
2001లో మొదలైన పల్సర్ ప్రయాణం..
2001కి ముందు భారత ద్విచక్ర వాహన మార్కెట్లో 100cc కమ్యూటర్ బైక్‌లకే ఎక్కువ డిమాండ్ ఉండేది.
అయితే బజాజ్ పల్సర్ 150, పల్సర్ 180 మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడంతో పరిస్థితి క్రమంగా మారింది.
పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, ప్రత్యేకమైన డిజైన్, గుండ్రని హెడ్‌ల్యాంప్, మెరుగైన పవర్ వంటి అంశాలు అప్పట్లో పల్సర్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
అప్పటివరకు ప్రధానంగా మైలేజ్‌నే దృష్టిలో పెట్టుకున్న బైక్ మార్కెట్లో.. పల్సర్ స్పోర్టీ రైడింగ్, స్టైల్, పెర్ఫార్మెన్స్‌కు కొత్త ప్రాధాన్యత తీసుకొచ్చింది.
దీంతో యువతలో ఈ బైక్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.
వివరాలు
డిజిటల్ మీటర్, కొత్త లైటింగ్‌తో మరింత ఆధునికంగా..
తర్వాతి సంవత్సరాల్లో బజాజ్ పల్సర్‌లో పలు కీలక మార్పులు చేసింది.
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త డిజైన్, పదునైన టెయిల్ ల్యాంప్ వంటి మార్పులను తీసుకొచ్చింది.
దీంతో అప్పటి పల్సర్ మోడళ్లు మరింత ఆధునికంగా కనిపించాయి.
కొత్త ఫీచర్లు, మెరుగైన డిజైన్‌తో పల్సర్ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకుంది.
వివరాలు
2007లో పల్సర్ 220F..
2007లో మార్కెట్లోకి వచ్చిన పల్సర్ 220F.. పల్సర్ చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలిచింది.
హాఫ్-ఫెయిరింగ్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, హైవే పెర్ఫార్మెన్స్ వంటి అంశాలతో ఈ మోడల్ యువతను ఆకట్టుకుంది.
ముఖ్యంగా స్పోర్టీ లుక్, మెరుగైన పనితీరుతో పల్సర్ 220Fకు మంచి ఆదరణ లభించింది.
వివరాలు
2012లో NS200తో కొత్త తరం..
2012లో బజాజ్ పల్సర్ కుటుంబంలో మరో భారీ మార్పు తీసుకొచ్చింది. పల్సర్ NS200ను పరిచయం చేసింది.
నేకెడ్ స్పోర్ట్స్ డిజైన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్, కొత్త ఛాసిస్ వంటి అంశాలతో NS200.. అప్పటివరకు వచ్చిన పల్సర్ మోడళ్లకు పూర్తిగా భిన్నమైన రూపాన్ని సంతరించుకుంది.
ఈ దశతో బజాజ్ పల్సర్ కుటుంబాన్ని మరింత విస్తరించడం ప్రారంభించింది.
ఆ తర్వాత RS200 వంటి ఫుల్-ఫెయిర్డ్ మోడళ్లు, AS సిరీస్‌లోని వేరియంట్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి.
దీంతో పల్సర్ కేవలం ఒకే మోడల్‌గా కాకుండా.. విభిన్న అవసరాలు, రైడింగ్ స్టైల్స్‌కు అనుగుణంగా పలు మోడళ్లతో కూడిన కుటుంబంగా మారింది.