LOADING...
Electric Two Wheelers: ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి పెద్ద అడుగు.. రూ.30,000 వరకు సబ్సిడీ ప్రకటించిన ఒడిశా!
ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి పెద్ద అడుగు.. రూ.30,000 వరకు సబ్సిడీ ప్రకటించిన ఒడిశా!

Electric Two Wheelers: ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి పెద్ద అడుగు.. రూ.30,000 వరకు సబ్సిడీ ప్రకటించిన ఒడిశా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2025
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌పై సబ్సిడీ మొత్తాన్ని పెంచింది. ఇంతకుముందు గరిష్టంగా రూ.20,000 ఇస్తున్న ఈ సబ్సిడీని ఇప్పుడు రూ.30,000కు పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఈ అడుగు వేసింది. ఈ సవరణను కొత్త డ్రాఫ్ట్ EV పాలసీ 2025లో చేర్చింది. పరిశ్రమ నిపుణులు, ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ పాలసీని ఐదు సంవత్సరాల పాటు అమలు చేయనుంది.

Details

ద్విచక్ర వాహనాలకు పెరిగిన సబ్సిడీ 

డ్రాఫ్ట్ EV పాలసీ 2025 ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి kWh బ్యాటరీ సామర్థ్యానికి రూ.5,000 ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. ఈ సబ్సిడీ గరిష్టంగా రూ.30,000 వరకు లభిస్తుంది. ఇంతకుముందు గరిష్ట పరిమితి రూ.20,000 మాత్రమే. అధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన వాహనాలు మార్కెట్లోకి రావడంతో సబ్సిడీని పెంచినట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులకు డిమాండ్ మరింత పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Details

టాక్సీలకు రూ.2 లక్షల వరకు సాయం 

ద్విచక్ర వాహనాలతో పాటు బ్యాటరీ ఆధారిత మూడు చక్రాల వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, టాక్సీలు, ట్రక్కులు, బస్సులకు కూడా సబ్సిడీ లభిస్తుంది. ప్రతిపాదిత EV పాలసీ 2025 ప్రకారం, టాక్సీలకు ఇంతవరకు ఇచ్చిన రూ.1.50 లక్షల ప్రోత్సాహకాన్ని రూ.2 లక్షలకు పెంచారు. అదనంగా విద్యుత్ బస్సుల రిజిస్ట్రేషన్ కోసం రూ.20 లక్షల ప్రోత్సాహకం అందిస్తారు. కేవలం ఒడిశా నివాసితులకే లబ్ధి పాలసీ డాక్యుమెంట్ ప్రకారం, ఈ ప్రయోజనాలు కేవలం ఒడిశా శాశ్వత నివాసితులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రతి లబ్ధిదారు ఒకో విభాగంలో ఒక్కసారి మాత్రమే వాహనం కొనుగోలు చేసి సబ్సిడీ పొందగలరు. అదనంగా పరిశోధన, అభివృద్ధి(R\&D)కోసం రూ.15 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని డ్రాఫ్ట్ పాలసీ ప్రతిపాదించింది.

Details

EV లక్ష్యాల సాధన 

ఒడిశా ఎలక్ట్రిక్ పాలసీ 2021లో 2025 నాటికి కొత్త వాహన రిజిస్ట్రేషన్లలో 20% ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ నాలుగేళ్లలో ఆ శాతం కేవలం 9%కే పరిమితమైంది. అందువల్ల ఇప్పుడు 2030 నాటికి కొత్త రిజిస్ట్రేషన్లలో 50% ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తానికి, కొత్త డ్రాఫ్ట్ EV పాలసీ 2025 ద్వారా ఒడిశా ప్రభుత్వం విద్యుత్ వాహనాల వాడకాన్ని మరింతగా ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది.