Vehicles: భారత్‌లో 2027 నుంచి బీఎస్-7 నిబంధనలు.. వాహనాలపై కఠిన నియంత్రణలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2027 నుంచి కార్లు, బస్సులు, ట్రక్కులపై మరింత కఠినమైన ఉద్గార ప్రమాణాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్ స్టేజ్-7 (బీఎస్-7) నిబంధనలు తీసుకురానున్నారు. ఈ కొత్త నిబంధనల ద్వారా వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాల పరిధిని మరింత విస్తరించనున్నారు. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాల్లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది.
వివరాలు
భారత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు
బీఎస్-7 నిబంధనలు యూరో-7 ప్రమాణాలను పోలి ఉన్నప్పటికీ, భారతదేశంలో ఉన్న రోడ్లు, ఇంధన నాణ్యత, డ్రైవింగ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించనున్నారు. కొత్తగా అమలు చేసే ఈ నిబంధనల్లో తేలికపాటి, భారీవాహనాల నుంచి వెలువడే అమోనియా ఉద్గారాలపై కూడా కఠిన నియంత్రణలు ఉండనున్నాయి. దీంతో పట్టణాల్లో పొగమంచు (స్మాగ్) సమస్యను తగ్గించాలనే ఉద్దేశం ఉంది. అలాగే 2027లో అమ్మకానికి వచ్చే వాహనాల్లో రియల్ టైమ్ కాలుష్య మానిటరింగ్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది.
వివరాలు
యూరో-7 నిబంధనలు భారత్ అనుసరిస్తుందా?
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, బీఎస్-7 నిబంధనలు వాహనాల పనితీరు, దీర్ఘకాలిక వినియోగాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించనున్నాయి. అయితే టైర్లు, బ్రేకుల నుంచి వచ్చే కాలుష్యంపై యూరో-7లో ఉన్న నియంత్రణలను భారత్ అమలు చేస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. బీఎస్-7 నిబంధనలతో పాటు కార్పొరేట్ అవరేజ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ (కేఫ్-3) ప్రమాణాలను కూడా తుది దశకు తీసుకువస్తున్నారు. వాహనాల ఉద్గారాలను తగ్గించేందుకు కంపెనీలకు లక్ష్యాలను నిర్దేశించే విధంగా ఈ నిబంధనలు ఉండనున్నాయి. బీఎస్-7 డ్రాఫ్ట్‌ను త్వరలో విడుదల చేసి, సంబంధిత వర్గాలతో చర్చలు జరపనున్నట్లు సమాచారం.