LOADING...
CAFE III: కారు కొనుగోలు దారులకు షాక్.. CAFE-IIIతో ధరలు పెరగనున్నాయా?
కారు కొనుగోలు దారులకు షాక్.. CAFE-IIIతో ధరలు పెరగనున్నాయా?

CAFE III: కారు కొనుగోలు దారులకు షాక్.. CAFE-IIIతో ధరలు పెరగనున్నాయా?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2026
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎంట్రీ లెవల్ పెట్రోల్ కారు కొనాలంటే ఇకపై మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి రానుంది. భారత్‌లో త్వరలో కఠినమైన కార్పొరేట్ అవరేజ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ (CAFE)-III నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ కొత్త మార్గదర్శకాలతో ఆటో మొబైల్ రంగంలో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ముఖ్యంగా పెద్ద కంపెనీలపై మరింత కఠినమైన ఇంధన సామర్థ్య లక్ష్యాలు విధించనున్నారు. ఇప్పటివరకు చిన్న కార్లకు ఉన్న మినహాయింపులను కూడా తొలగించడంతో, చిన్న కార్ల తయారీదారులపై కూడా కఠిన నియమాలు అమలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో కార్ల ధరలు పెరగడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. CAFE-III కింద ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

వివరాలు 

CO2 ఉద్గారాలపై కఠిన చర్యలు.. ఆటో కంపెనీలకు షాక్

ప్రస్తుత డ్రాఫ్ట్‌లో ఉన్న స్లోప్ విలువ 0.002ను తుది రూపంలో 0.00153కు తగ్గించే అవకాశముందని ఒక ఉన్నతాధికారి ఎకనామిక్ టైమ్స్‌కు తెలిపారు. అంటే వాహనం బరువు ప్రతి కిలో పెరిగినప్పుడూ విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ పరిమితిని మరింత కట్టుదిట్టం చేయనున్నారు. భద్రతా పరికరాలు,బ్యాటరీల వల్ల కార్ల బరువు పెరుగుతున్నా,కాలుష్య ప్రమాణాలు మాత్రం తగ్గకుండా ఉండేలా నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో పెద్ద వాహనాల తయారీదారులు ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ టెక్నాలజీ వైపు మరింతగా మొగ్గు చూపాల్సి రావచ్చు.

వివరాలు 

ఆటో రంగంలో కీలక మలుపు.. చిన్న కార్ల ఫీచర్లు, ధరల్లో మార్పులు?

సెప్టెంబర్ 2025లో తాజా మార్పులతో రెండో డ్రాఫ్ట్ విడుదలైన తర్వాత, ఈ తుది నిబంధనలు ప్రధానమంత్రి కార్యాలయానికి ఆమోదం కోసం పంపనున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి తుది నిబంధనలు వెలువడతాయని భావించినా, మరికొంత ఆలస్యం అయ్యే అవకాశముంది. ముఖ్యంగా చిన్న కార్లకు మినహాయింపులు తొలగించడంతో ఎంట్రీ లెవల్ పెట్రోల్ కార్ల ధరలు పెరగడం దాదాపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రమాణాలకు అనుగుణంగా ఖరీదైన ఇంధన పొదుపు సాంకేతికతలు ప్రవేశపెట్టాల్సి రావడంతో కంపెనీలపై భారం పెరుగుతుంది. లేదంటే జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో చిన్న కార్ల ధరలు, ఫీచర్లపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది.

Advertisement