CAFE III: 2027 నుంచి కొత్త CAFE-III నిబంధనలు.. కారు కొనేవారిపై ప్రభావం ఏంటి?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో ప్రయాణికుల కార్ల ఇంధన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందుకు సంబంధించిన కార్పొరేట్ అవరేజ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ(CAFE-III) ముసాయిదా నిబంధనలను విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న CAFE-II స్థానంలో ఈ కొత్త నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చి 2032 మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. కొత్త ముసాయిదా ప్రకారం 2027-28 ఆర్థిక సంవత్సరానికి వాహన తయారీ సంస్థల మొత్తం వాహనాల సగటు కార్బన్ డైఆక్సైడ్(CO₂)ఉద్గారాల లక్ష్యాన్ని కిలోమీటరుకు 94.76గ్రాములుగా నిర్ణయించారు. అనంతరం ప్రతి ఏడాది నిబంధనలు మరింత కఠినతరం అవుతూ 2031-32 నాటికి ఈ పరిమితి 78.90గ్రాముల CO₂/కిలోమీటర్కు తగ్గనుంది.
వివరాలు
కంపెనీ విక్రయించే మొత్తం కార్ల సగటు ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యం
ఈ ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న WLTP (Worldwide Harmonised Light Vehicles Test Procedure) పరీక్షా విధానాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారు.
CAFE నిబంధనల ప్రధాన ఉద్దేశం ప్రతి కారు మోడల్‌కు ఒకే ప్రమాణాన్ని విధించడం కాదు.
ఒక కంపెనీ విక్రయించే మొత్తం కార్ల సగటు ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యం.
నిర్ణయించిన పరిమితులను మించిన ఉద్గారాలు విడుదల చేసే సంస్థలకు జరిమానాలు విధించడంతో పాటు, తక్కువ కాలుష్య సాంకేతికతలు, అధిక ఇంధన సామర్థ్యం కలిగిన వాహనాల అభివృద్ధిని ప్రోత్సహించడమే దీని ఉద్దేశం.
దీని ద్వారా దేశంలో చమురు దిగుమతుల భారాన్ని కూడా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.
వివరాలు
క్రెడిట్-డెబిట్ విధానం
CAFE-IIIలో అత్యంత ముఖ్యమైన మార్పు క్రెడిట్-డెబిట్ విధానం ప్రవేశపెట్టడం.
లక్ష్యాల కంటే మెరుగైన పనితీరు కనబరిచిన వాహన తయారీ సంస్థలకు క్రెడిట్లు లభిస్తాయి.
లక్ష్యాలను అందుకోలేని సంస్థలకు డెబిట్లు నమోదవుతాయి. ఈ వివరాలన్నీ డిజిటల్ కంప్లయెన్స్ ఖాతాలో నమోదు చేస్తారు.
అదనంగా సంపాదించిన క్రెడిట్లను భవిష్యత్తులో ఉపయోగించుకోవచ్చు లేదా ఇతర కంపెనీలకు బదిలీ చేయవచ్చు.
అయినప్పటికీ లోటు ఉంటే ప్రభుత్వం నిర్ణయించే ధరలకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) నుంచి క్రెడిట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఈ ధర 2027-28లో గ్రాము CO₂కు రూ.2,500గా ఉండగా, 2031-32 నాటికి రూ.4,500కు పెరగనుంది.
వివరాలు
పర్యావరణహిత ఇంధనాలు, సాంకేతికతలకు ప్రత్యేక ప్రోత్సాహం
కొత్త నిబంధనల్లో పర్యావరణహిత ఇంధనాలు, సాంకేతికతలకు ప్రత్యేక ప్రోత్సాహం కల్పించారు.
E20 లేదా అంతకంటే ఎక్కువ ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడే వాహనాలకు 8 శాతం, ఫ్లెక్స్-ఫ్యూయల్ ఎథనాల్ వాహనాలు,ఫ్లెక్స్-ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలకు 22.3 శాతం ప్రయోజనం లభిస్తుంది.
CNG వాహనాలకు 5 శాతం రాయితీ ఉండగా, డీజిల్ వాహనాలకు భవిష్యత్తులో బయోడీజిల్ మిశ్రమాల స్థాయిని బట్టి ప్రయోజనాలు కల్పించనున్నారు.
గత ఏడాది సెప్టెంబరులో విడుదల చేసిన ప్రతిపాదనతో పోలిస్తే తాజా ముసాయిదా కొంత సడలింపులతో ఉంది.
ఉద్గారాల లక్ష్యాలను లెక్కించే విధానంలో మార్పులు చేయడంతో తేలికపాటి వాహనాలను తయారు చేసే కంపెనీలకు నిబంధనలు పాటించడం కొంత సులభమవుతుంది.
వివరాలు
CAFE-II కంటే మరింత కఠినంగా CAFE-III
అలాగే కంపెనీలు లక్ష్యాలను చేరుకోవడానికి పలు మార్గాలను ప్రభుత్వం కల్పించింది.
మెరుగైన పనితీరుతో క్రెడిట్లు సంపాదించడం,వాటిని భవిష్యత్తుకు నిల్వ చేసుకోవడం,ఇతర సంస్థలతో మార్పిడి చేసుకోవడం లేదా అవసరమైతే కొనుగోలు చేయడం వంటి అవకాశాలు ఉన్నాయి.
హైబ్రిడ్,ఫ్లెక్స్-ఫ్యూయల్,CNG వాహనాలు,ఇంధనాన్ని ఆదా చేసే సాంకేతికతలు ఉపయోగించినా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.
అయితే CAFE-III ప్రస్తుతం అమల్లో ఉన్న CAFE-II కంటే మరింత కఠినంగా ఉంటుంది.
2027-28 నుంచి 2031-32 వరకు ప్రతి ఏడాది ఉద్గారాల లక్ష్యాలు తగ్గుతూ ఉంటాయి.
అంతేకాకుండా వాహన తయారీ సంస్థలు ప్రస్తుతం అమల్లో ఉన్నMIDC (Modified Indian Driving Cycle) పరీక్షా విధానంతో పాటు అంతర్జాతీయ ప్రమాణమైన WLTP ప్రకారం కూడా ఇంధన వినియోగం, CO₂ ఉద్గారాల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు
కొత్త నిబంధనల ప్రభావం వినియోగదారులపై కూడా కనిపించే అవకాశం
ప్రస్తుతం భారత్‌లో వాహనాల ఇంధన సామర్థ్యాన్ని MIDC విధానం ఆధారంగా అంచనా వేస్తున్నారు.
అయితే ప్రభుత్వం వెంటనే WLTP విధానానికి మారడం లేదు. కొంతకాలం రెండు విధానాల ప్రకారం డేటాను సేకరించి,భవిష్యత్తులో పూర్తిస్థాయిలో WLTP ఆధారిత వ్యవస్థకు మారే అవకాశాన్ని పరిశీలించనుంది.
దీంతో భారత పరీక్షా ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు మరింత దగ్గరవుతాయి.
ఈ కొత్త నిబంధనల ప్రభావం వినియోగదారులపై కూడా కనిపించే అవకాశం ఉంది.
ఉద్గారాలను తగ్గించే కొత్త సాంకేతికతలను వాహనాల్లో అమలు చేయడానికి తయారీ సంస్థలకు అదనపు వ్యయం అవుతుంది.
వివరాలు
వినియోగదారులకు ప్రయోజనాలు
దీంతో భవిష్యత్తులో కొన్ని మోడళ్ల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అది ఒక్కసారిగా కాకుండా క్రమంగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
అయితే దీని వల్ల వినియోగదారులకు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
మెరుగైన ఇంధన సామర్థ్యం ఉన్న వాహనాలు అందుబాటులోకి రావడంతో దీర్ఘకాలంలో ఇంధన ఖర్చు తగ్గే అవకాశం ఉంది.
ముఖ్యంగా పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు మారకుండా తక్కువ ఇంధన వినియోగం కోరుకునే వారికి హైబ్రిడ్ కార్లు మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మారే అవకాశముంది.