CNG price hike: ఢిల్లీలో మళ్లీ సిఎన్‌జీ ధరల పెంపు.. ఆటో, క్యాబ్ ఛార్జీలపై ప్రభావం?
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో సిఎన్‌జీ వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (CNG) ధరలు మళ్లీ పెరగడంతో రోజువారీ ప్రయాణ ఖర్చులు మరింత భారంగా మారనున్నాయి. తాజా పెంపుతో ఢిల్లీలో సిఎన్‌జీ ధర కిలోకు రూ.80.09కు చేరుకుంది. దీంతో సిఎన్‌జీ కార్లు, ఆటోలు, క్యాబ్ సర్వీసుల నిర్వహణ వ్యయం గణనీయంగా పెరగనుంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి సిఎన్‌జీ ధరలు పెరగడం గమనార్హం. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు అమెరికన్ డాలర్ విలువ బలపడటంతో ఇంధన దిగుమతి వ్యయం కూడా పెరిగినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఢిల్లీలో సిఎన్‌జీ కిలో ధర రూ.80.09
తాజా ధరల ప్రకారం ఢిల్లీలో సిఎన్‌జీ కిలో ధర రూ.80.09గా ఉండగా, నోయిడా, ఘజియాబాద్‌లో రూ.88.70గా నిర్ణయించారు. గురుగ్రామ్‌లో కిలో ధర రూ.85.12కు చేరుకుంది. అలాగే మీరట్, ముజఫర్‌నగర్, షామ్లీ ప్రాంతాల్లో రూ.88.58, కాన్పూర్‌లో రూ.91.42, అజ్మీర్‌లో రూ.89.44, బండలో రూ.86.42, హాపూర్‌లో రూ.89.70గా సిఎన్‌జీ ధరలు నమోదయ్యాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) తెలిపిన వివరాల ప్రకారం, సహజ వాయువు కొనుగోలు ఖర్చులు పెరగడం, కరెన్సీ మార్పిడి ప్రభావం కారణంగా ఈ ధరల పెంపు చేపట్టాల్సి వచ్చిందని వెల్లడించింది. అయితే ఈ పెంపు ప్రభావం ఎక్కువగా రోజూ ప్రయాణించే ప్రయాణికులు, సిఎన్‌జీ వాహన యజమానులపై పడనుంది. సిఎన్‌జీ ధరల పెంపు ప్రజా రవాణా ఛార్జీలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
వివరాలు
ఎక్కువ శాతం సీఎన్జీ వాహనాలే
ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఎక్కువ శాతం ఆటోలు, ట్యాక్సీలు, కమర్షియల్ వాహనాలు సిఎన్‌జీపైనే నడుస్తుండటంతో అదనపు ఇంధన భారం ప్రయాణికులపై మోపే అవకాశముంది. ఇప్పటికే ముంబైలో ఆటో యూనియన్లు కనీస చార్జీని రూ.1 పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రైవేట్ సిఎన్‌జీ కార్ల యజమానులపై కూడా ఈ పెంపు ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ఉదాహరణకు టాటా పంచ్ సీఎన్జీ కారు ARAI ప్రకారం కిలో సిఎన్‌జీకి 22.99 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. తాజా ధరల ప్రకారం ఈ కారును నడపడానికి కిలోమీటరుకు సుమారు రూ.3.48 ఖర్చవుతుంది. ఈ కారులో ఉన్న 60 లీటర్ల సిఎన్‌జీ ట్యాంక్‌లో సుమారు 10 కిలోల గ్యాస్ పడుతుండటంతో పూర్తి ట్యాంక్ నింపించుకోవడానికి దాదాపు రూ.800 వరకు ఖర్చవుతుంది.
వివరాలు
పూర్తి రీఫిల్‌కు రూ.560 నుంచి రూ.720 వరకు ఖర్చు
అలాగే మారుతీ సుజుకీ సిఫ్ట్ సీఎన్జీ మాన్యువల్ వెర్షన్‌లో కిలో సిఎన్‌జీకి గరిష్టంగా 32.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. తాజా ధరల ప్రకారం ఈ కారును నడపడానికి కిలోమీటరుకు సుమారు రూ.2.44 ఖర్చవుతుంది. 55 లీటర్ల సిఎన్‌జీ ట్యాంక్‌లో సాధారణంగా 7 నుంచి 9 కిలోల వరకు గ్యాస్ పడుతుండటంతో పూర్తి రీఫిల్‌కు రూ.560 నుంచి రూ.720 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. అయితే ఈ లెక్కలు కంపెనీలు ప్రకటించిన మైలేజ్ ఆధారంగా మాత్రమే ఉంటాయని, వాస్తవ పరిస్థితుల్లో ట్రాఫిక్, హైవే డ్రైవింగ్, డ్రైవింగ్ స్టైల్, వాహన లోడ్ వంటి అంశాల ప్రభావంతో మైలేజ్ మారవచ్చని నిపుణులు చెబుతున్నారు.