Delhi New EV Policy: దిల్లీ కొత్త ఈవీ పాలసీకి ఆమోదం.. ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ రాయితీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తూ,వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ప్రకారం రూ.30లక్షల వరకు ధర ఉన్న అన్ని ఎలక్ట్రిక్ కార్లపై రోడ్డు పన్ను,రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా మినహాయించనుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి వచ్చే నాలుగేళ్లలో సుమారు రూ.15,000 కోట్లను పెట్టుబడిగా వెచ్చించనున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు. కొత్త ఈవీ పాలసీలో ఎలక్ట్రిక్ ద్విచక్ర,త్రిచక్ర వాహనాల కొనుగోలుదారులకు కూడా ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేసిన వారికి మొదటి ఏడాది రూ.30,000,రెండో ఏడాది రూ.20,000, మూడో ఏడాది రూ.10,000 సబ్సిడీ అందించనున్నారు.
వివరాలు
ఎన్1 కేటగిరీకి చెందిన ఎలక్ట్రిక్ ట్రక్కుల కొనుగోలుపై రూ.1 లక్ష వరకు ప్రోత్సాహకం
అలాగే ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు కొనుగోలు చేసిన వారికి మొదటి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.40,000, మూడో ఏడాది రూ.30,000 వరకు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందించనుంది. ఎన్1 కేటగిరీకి చెందిన ఎలక్ట్రిక్ ట్రక్కుల కొనుగోలుపై గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. అలాగే బీఎస్-4 లేదా అంతకంటే పాత ప్రమాణాలున్న నాలుగు చక్రాల వాహనాలను స్క్రాప్ చేసి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసే యజమానులకు రూ.1 లక్ష స్క్రాపింగ్ ప్రోత్సాహకం అందించనున్నారు.
వివరాలు
హైబ్రిడ్ వాహనాలకు ఈ కొత్త పాలసీలో ఎలాంటి సబ్సిడీ ఉండదు
అయితే హైబ్రిడ్ వాహనాలకు ఈ కొత్త పాలసీలో ఎలాంటి సబ్సిడీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈవీ సంబంధిత ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, పాత వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. 2030 మార్చి 31 నాటికి ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా మార్చాలనే లక్ష్యంతో ఈ కొత్త ఈవీ పాలసీని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.