Volvo: ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ తగ్గుముఖం.. హైబ్రిడ్ కార్లపై 'వోల్వో' దృష్టి
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గుతున్న దృష్ట్యా లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో తన వ్యూహాన్ని మార్చుకుంది. 2030 నాటికి 90-100 శాతం ఎలక్ట్రిక్ లేదా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడళ్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాకుండా 10 శాతం వాహనాలు మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. గతంలో ఈ కంపెనీ హైబ్రిడ్ కార్లను తొలగిస్తూ ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించాలని ప్లాన్ చేసింది. వోల్వో ప్రస్తుతం ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను విక్రయించనుంది. వోల్వో కార్స్ తన భవిష్యత్ లాభాల వృద్ధిలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్స్ ముఖ్యమైన భాగంగా ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ తన హైబ్రిడ్ XC90ని మళ్లీ లాంచ్ చేయనుంది.
ఈ ఏడాది చివరికల్లా మార్కెట్ లోకి
ఈ ఏడాది చివరి నాటికి ఇది మార్కెట్‌లోకి రానుంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, కస్టమర్ డిమాండ్‌లకు అనుగుణంగా స్పందిస్తున్నట్లు రాయిటర్స్ నివేదించింది. కంపెనీ EV పోర్ట్‌ఫోలియోలో EX90, EX30 వంటి ఎలక్ట్రిక్ SUVలు ఉన్నాయి. సరసమైన మోడల్‌లు లేకపోవడం, ఛార్జింగ్ పాయింట్ల నెమ్మదిగా రోల్ అవుట్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గుతున్నట్లు ప్రధాన కంపెనీలు చూస్తున్నాయి. వోల్వోతో సహా ఇతర కంపెనీలు హైబ్రిడ్ మోడల్‌ల వైపు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నాయి. టయోటాతో పాటు , రెనాల్ట్ వంటి కంపెనీలు కూడా హైబ్రిడ్ మోడళ్లపై దృష్టి సారించాయి.