డీజల్ వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రం వద్దకు కీలక నివేదిక
దేశంలో కర్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఓ కమిటీ కీలక ప్రతిపాదనలను పంపింది. 10 లక్షలకు పైబడి జనాభా కలిగిన నగరాల్లో 2027 నాటికి డీజల్ వాహనాలను పూర్తిగా బ్యాన్ చేయాలని పేర్కొంది. వాటి స్థానంలో విద్యుత్, గ్యాస్ ఆధారిత వాహనాలను వినియోగించాలని సూచించింది. భవిష్యత్తులోనూ ఈ దిశగా మరికొన్ని ప్రణాళికలను అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో చమురు మంత్రిత్వ శాఖ నియమించిన ఓ కమిటీ కొన్ని కీలకమైన ప్రతిపాదనలను పంపింది. క్లీనర్ మొబిలిటీ సొల్యూషన్స్ ను అమలు చేసే దిశగా ప్లాన్ చేశారు. ఫిబ్రవరిలోనే నివేదికను ప్రభుత్వానికి చేర్చినా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడమే భారత్ లక్ష్యం
కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో వాహనాల ఉద్గారాలను తగ్గించేందుకు డీజిల్ ఫోర్ వీలర్లను బ్యాన్ చేయాలని రాయిటర్స్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఫోర్ వీలర్ల విషయానికొస్తే.. ప్యాసింజర్ కార్లు సహా, ట్యాక్సీల్లో సగం వాహనాలను ఇథనాల్ కలిపిన పెట్రోల్ తో నడిపే విధంగానూ.. మిగిలిన 50శాతం విద్యుత్ వాహనాలుగానూ మార్చాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడమే భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. కర్బన్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేసే దేశాల్లో ప్రస్తుతం చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ నాలుగో స్థానంలో ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు ఈ చర్య ఉపయోగపడనుంది.