E20 Petrol: ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుందా? కేంద్ర మంత్రి క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఈ20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) పెట్రోల్‌పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, అపోహలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ స్పందించారు. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచే ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. అలాగే మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరల్లో చోటుచేసుకున్న పెరుగుదలపై కూడా స్పందించారు.
వివరాలు
ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుందా?
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడితే వాహనాల మైలేజ్ తగ్గుతుందన్న ప్రచారంపై హర్‌దీప్ పురీ స్పందిస్తూ.. స్వల్పంగా మైలేజ్ తగ్గే అవకాశం ఉండొచ్చని అంగీకరించారు. అయితే అదే సమయంలో వాహనాల యాక్సిలరేషన్ మెరుగుపడుతుందని చెప్పారు. రేసింగ్ కార్లలో కూడా ఇథనాల్‌ను పనితీరు మెరుగుపర్చేందుకు ఉపయోగిస్తున్నారని వివరించారు. "ఇథనాల్ వల్ల మైలేజ్ తగ్గుతుందని కొందరు అంటున్నారు. కానీ రేసింగ్ కార్లలో కూడా ఇథనాల్‌ను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల యాక్సిలరేషన్ మెరుగవుతుంది. ఇంజిన్ నాకింగ్ కూడా తగ్గుతుంది. మైలేజ్ విషయానికి వస్తే.. కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అయితే అది అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది" అని హర్‌దీప్ పురీ తెలిపారు.
వివరాలు
బీమా క్లెయిమ్‌లపై స్పష్టత
ఈ20 పెట్రోల్ ఉపయోగిస్తే వాహన బీమా క్లెయిమ్‌లు తిరస్కరిస్తారన్న ప్రచారాన్ని కూడా కేంద్ర మంత్రి ఖండించారు. అలాంటి సమస్య ఏదీ లేదని బీమా సంస్థలు ఇప్పటికే స్పష్టత ఇచ్చాయని తెలిపారు. "ఈ20 పెట్రోల్ వాడితే బీమా వర్తించదని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ బీమా కంపెనీలు ఇప్పటికే అలాంటి సమస్య ఏదీ లేదని స్పష్టం చేశాయి" అని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
ఎక్కువ ఇథనాల్ మిశ్రమ ఇంధనాలపై కేంద్రం
దేశంలో విద్యుత్ వాహనాలు,ఇథనాల్ మిశ్రమ ఇంధన వాహనాలు,హైబ్రిడ్ వాహనాలు,సీఎన్‌జీ వాహనాలకు సమానంగా అవకాశాలు ఉన్నాయని హర్‌దీప్ సింగ్ పురీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 20శాతం ఇథనాల్ మిశ్రమ ఇంధనం అమల్లో ఉందని,భవిష్యత్తులో 25శాతానికి పెంచాలంటే అవసరమైన అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం 22శాతం,25శాతం,27 శాతం, 30 శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన పెట్రోల్‌కు భారత ప్రమాణాల సంస్థ (BIS) ప్రమాణాలను ప్రకటించింది. అలాగే ఈ ఇంధనాలకు ఎక్సైజ్ సుంకంలో మినహాయింపులు కూడా ఇచ్చింది. అయితే అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాలకు ప్రమాణాలు ప్రకటించినంత మాత్రాన వాటిని వెంటనే మార్కెట్లోకి తీసుకురావడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇవి కేవలం నియంత్రణ పరమైన చర్యలేనని తెలిపింది.