Rushikonda Palace: లీజుకు రుషికొండ ప్యాలెస్ భవనాలు .. ఆసక్తి వ్యక్తీకరణకు ఏపీటీడీసీ పిలుపు
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ భవనాలను లీజుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విధానంలో ఈ భవనాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆతిథ్య, పర్యాటక రంగాలకు చెందిన సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)లను ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.452 కోట్ల ప్రజాధనంతో ఈ భవనాల నిర్మాణం చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా,ఈ భవనాల వినియోగంపై ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.
వివరాలు
భవనాలతో పాటు ఖాళీ స్థలం కూడా..
ఇటీవల మంత్రుల కమిటీ భవనాలను పరిశీలించిన అనంతరం వాటిని ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. రుషికొండలో 9.8 ఎకరాల విస్తీర్ణంలో ఐదు బ్లాకులుగా నిర్మించిన ఈ భవనాలను లీజుకు ఇవ్వనున్నారు. ఉద్యానవనాలు, అంతర్గత రహదారులు, నడక మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు తదితర మౌలిక వసతులతో ఈ సముదాయం సిద్ధంగా ఉందని ఏపీటీడీసీ వెల్లడించింది. అదనంగా 1,200 చదరపు మీటర్ల చొప్పున ఖాళీ స్థలాలు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. మొత్తం 4,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ+1 భవనాలు నిర్మించుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. ఆసక్తి ఉన్న సంస్థలు జులై 10లోపు తమ దరఖాస్తులు సమర్పించాలని సూచించింది.
వివరాలు
అదనపు గదుల నిర్మాణానికి అవకాశం
ఈ భవనాల నిర్వహణపై ఇప్పటికే తాజ్, అట్మాస్ఫియర్ కోర్, లీలా, ఫెమా వంటి అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఆయా సంస్థల ప్రతినిధులు భవనాలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు సమాచారం. అయితే బస కోసం అవసరమైన గదుల సంఖ్య తక్కువగా ఉండటంతో అదనపు గదుల నిర్మాణానికి ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించింది. మరోవైపు కొంత ఖాళీ స్థలం ఉన్నప్పటికీ తీరప్రాంత నియంత్రణ మండలి (సీఆర్‌జడ్) నిబంధనలు అభివృద్ధి పనులకు అడ్డంకిగా మారుతున్నాయి.
వివరాలు
పర్యాటకశాఖ వద్ద విస్తారమైన భూమి
రుషికొండ ప్రాంతంలో పర్యాటకశాఖ ఆధీనంలో మొత్తం 70.63 ఎకరాల భూమి ఉంది. ఇందులో 18.65 ఎకరాలు ప్రస్తుతం వినియోగంలో ఉండగా, మరో 47.4 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. మిగిలిన కొంత భూమి ఆక్రమణల్లో ఉన్నట్లు సమాచారం.