Electric Two-Wheeler ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో సంచలనం.. ఓలా పతనం, టీవీఎస్ దూకుడు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం వేగంగా మార్పులు చవిచూస్తోంది. ముఖ్యంగా 2026 ప్రారంభం నుంచే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో గణనీయమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. గతంలో అగ్రస్థానంలో నిలిచిన కొన్ని బ్రాండ్లు వెనక్కి వెళ్లగా, సంప్రదాయ వాహన తయారీ సంస్థలు మాత్రం ఈవీ రంగంలో తమ స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నాయి. జనవరి నెల అమ్మకాల గణాంకాలు చూస్తే ఏ కంపెనీ ఎలాంటి ప్రదర్శన ఇచ్చిందో స్పష్టంగా అర్థమవుతోంది.
వివరాలు
టీవీఎస్ మోటార్:
2026 జనవరి నెలలో టీవీఎస్ 34,558 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించి మార్కెట్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది ఇదే కాలంలో నమోదైన 24,028 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 43.8 శాతం వృద్ధి సాధించడం విశేషం. సుమారు 28.1 శాతం మార్కెట్ వాటాతో టీవీఎస్ తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకుంది. కొత్త మోడళ్ల ప్రవేశం, విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ ఈ విజయానికి ప్రధాన కారణాలుగా మారాయి.
వివరాలు
బజాజ్ ఆటో:
చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో బజాజ్ ఆటో కూడా మార్కెట్‌లో తన దూకుడును కొనసాగిస్తోంది. జనవరిలో 25,598 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచిన బజాజ్, గతేడాదితో పోలిస్తే 19.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. పాత బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం, మెటల్ బాడీతో వచ్చే స్కూటర్ల నాణ్యత మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం బజాజ్ మార్కెట్ వాటా 20.8 శాతంగా ఉంది.
వివరాలు
ఏథర్ ఎనర్జీ:
ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో పేరొందిన ఏథర్ ఎనర్జీ మూడో స్థానాన్ని సాధించింది. ఈ సంస్థ జనవరిలో 21,999 యూనిట్లను విక్రయించి, గత ఏడాదితో పోలిస్తే 67.9 శాతం భారీ వృద్ధిని సాధించింది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ, తాజాగా విడుదలైన 'రిజ్టా' వంటి కుటుంబ అవసరాలకు అనువైన మోడళ్లు అమ్మకాల పెరుగుదలకు తోడ్పడ్డాయి. దీంతో ఏథర్ మార్కెట్ వాటా 17.9 శాతానికి చేరుకుంది.
వివరాలు
హీరో విడా :
ఎలక్ట్రిక్ విభాగంలో హీరో మోటోకార్ప్ తన 'విడా' బ్రాండ్‌తో దూసుకెళ్తోంది. ఈ ఏడాది జనవరిలో 13,302 యూనిట్ల విక్రయాలతో గతేడాదితో పోలిస్తే ఏకంగా 718 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బలమైన డీలర్ నెట్‌వర్క్ ద్వారా హీరో విదా వేగంగా మార్కెట్‌లో పట్టు సాధిస్తోంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ మార్కెట్ వాటా 10.8 శాతానికి చేరింది.
వివరాలు
ఓలా ఎలక్ట్రిక్:
ఒకప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో సుమారు 40 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచిన ఓలా ఎలక్ట్రిక్, ఇప్పుడు ఐదో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. జనవరిలో కేవలం 7,516 యూనిట్లనే విక్రయించిన ఈ సంస్థ, గత ఏడాదితో పోలిస్తే 69.21 శాతం భారీ క్షీణతను ఎదుర్కొంది. సర్వీస్ సంబంధిత సమస్యలు, వినియోగదారుల ఫిర్యాదులు, పెరుగుతున్న పోటీ కారణంగా ఓలా మార్కెట్ వాటా గణనీయంగా తగ్గింది. మొత్తంగా చూస్తే, 2026 ప్రారంభంలో భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రంగం కొత్త దిశలో పయనిస్తోంది. వినియోగదారుల నమ్మకం, సేవల నాణ్యత, విస్తృత నెట్‌వర్క్ ఉన్న కంపెనీలకే మార్కెట్‌లో పైచేయి దక్కుతున్నట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.