Loading...
e-2W penetration: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. e-2Wల వాటా 10%కి చేరువ.. e-3Wల్లో 46% దాటింది!
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. e-2Wల వాటా 10%కి చేరువ.. e-3Wల్లో 46% దాటింది!

e-2W penetration: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. e-2Wల వాటా 10%కి చేరువ.. e-3Wల్లో 46% దాటింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2026
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీకి ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, బస్సులు, వాణిజ్య వాహనాల విభాగాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-DRIVE) పథకం ఈ వృద్ధికి కీలకంగా నిలుస్తోంది. ఈ పథకం తాజా గణాంకాలను శుక్రవారం (సెప్టెంబర్ 25) IFCI Ltd సీఎజీఎం సునీత్ శుక్లా వెల్లడించారు. మనేసర్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT)లో నిర్వహించిన "PM E-DRIVE: Dialogue with the Industry" కార్యక్రమంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ICAT 20 ఏళ్ల వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వివరాలు

10 శాతానికి చేరువలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు

ఇందులో ప్రభుత్వం, ఆటో మొబైల్ పరిశ్రమ, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని దేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థపై చర్చించారు. ఈ సందర్భంగా వాహనాల వివిధ విభాగాల్లో పీఎం ఈ-డ్రైవ్ పథకం పురోగతి, ఛార్జింగ్ మౌలిక వసతులు, ఆటోమోటివ్ టెస్టింగ్ సామర్థ్యాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విభాగంలో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది.

సునీత్ శుక్లా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. FY2021-22లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (e-2W) పెనిట్రేషన్ 1.9 శాతంగా ఉండగా.. FY2025-26 నాటికి 6.6 శాతానికి పెరిగింది.

ఇక FY2026-27లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు తొలి ఐదు నెలల్లో ఇది 9.9 శాతానికి చేరుకుంది.

వివరాలు

గడువు మార్చి 31వరకు పొడిగింపు

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విషయంలో పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ప్రభుత్వం లక్ష్యాన్ని కూడా పెంచింది. తొలుత 24.8 లక్షల వాహనాలు లక్ష్యంగా ఉండగా.. దాన్ని 45.8 లక్షలకు పెంచారు.

అలాగే పథకాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించారు. e-2W విభాగానికి పీఎం ఈ-డ్రైవ్ కింద రూ.2,767 కోట్ల కేటాయింపు ఉంది.

ప్రస్తుతం ఈ పథకం కింద 21 రిజిస్టర్డ్ e-2W OEMలు, 170 ఆమోదిత మోడళ్లు ఉన్నాయి.

తాజా పీఎం ఈ-డ్రైవ్ డ్యాష్‌బోర్డ్ ప్రకారం.. 2026 సెప్టెంబర్ 19 నాటికి వాహన్‌కు అనుసంధానమైన డేటా ఆధారంగా పీఎం ఈ-డ్రైవ్ కింద 25 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విక్రయించారు.

పథకం లక్ష్యం 45.79 లక్షల వాహనాలు.

ADVERTISEMENT

వివరాలు

ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల్లో మరింత వేగం

ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల విభాగంలో మార్పు మరింత వేగంగా కనిపిస్తోంది.

L5 ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల పెనిట్రేషన్ FY2021-22లో 4.7శాతంగా ఉండగా.. FY2025-26నాటికి 31.7 శాతానికి చేరుకుంది. FY2026-27 ఏప్రిల్-ఆగస్టు మధ్య ఇది ఏకంగా 46.1 శాతానికి పెరిగింది.

PM E-DRIVEలో L5 విభాగానికి రూ.857 కోట్ల కేటాయింపు ఉంది. సుమారు 2.89 లక్షల వాహనాలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే ఇతర విభాగాలకు భిన్నంగా L5 ఇన్సెంటివ్‌ను లక్ష్య విక్రయాలు చేరుకున్న తర్వాత 2025 డిసెంబర్ 26న మూసివేశారు.

అధికారిక PM E-DRIVE పోర్టల్ కూడా ఇదే తేదీని ధ్రువీకరిస్తోంది.

భారత్‌లోని వాణిజ్య, చివరి మైలు రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల వినియోగం ఎంత వేగంగా పెరుగుతోందో ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

దాదాపు 14 వేల ఎలక్ట్రిక్ బస్సులు

ప్రజా రవాణా కూడా పీఎం ఈ-డ్రైవ్ పథకంలో కీలక విభాగంగా ఉంది.

ఈ పథకం కింద 14,028 ఎలక్ట్రిక్ బస్సుల కోసం రూ.4,391 కోట్లు కేటాయించారు. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, ముంబై, పుణె నగరాల్లో మొత్తం 13,800ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయి.

నగరాల వారీగా చూస్తే.. బెంగళూరుకు 4,500బస్సులు, ఢిల్లీకి 2,800, హైదరాబాద్‌కు 2,200, అహ్మదాబాద్‌కు 1,200, సూరత్‌కు 600, ముంబైకి 1,500, పుణెకు 1,000 బస్సులు కేటాయించారు.

అధికారిక గణాంకాల ప్రకారం.. FY2025-26లో 7.20 శాతంగా ఉన్న e-bus పెనిట్రేషన్.. FY2026-27లో ఆగస్టు 31 వరకు 8.32 శాతానికి పెరిగింది.

14,028 ఎలక్ట్రిక్ బస్సుల లక్ష్యంలో రెండు దశల్లో 13,800 బస్సులు కేటాయించినట్లు ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది.

వివరాలు

ఎలక్ట్రిక్ ట్రక్కులపై కూడా దృష్టి

పీఎం ఈ-డ్రైవ్ పథకం ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రక్కులకు కూడా మద్దతు అందిస్తోంది. ఈ విభాగానికి రూ.500 కోట్లు కేటాయించారు.

5,600కు పైగా ఎలక్ట్రిక్ ట్రక్కులను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం కింద N2, N3 కేటగిరీల ట్రక్కులు అర్హత పొందుతాయి.

వీటి గరిష్ఠ ఎక్స్-ఫ్యాక్టరీ ధర రూ.1.25 కోట్లుగా ఉండాలి. అలాగే అధీకృత రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ నుంచి స్క్రాపింగ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.

ICATలో వెల్లడైన వివరాల ప్రకారం IPL Tech, Tata Motors ఎలక్ట్రిక్ ట్రక్ మోడళ్లకు PM E-DRIVE సర్టిఫికేషన్ లభించింది.

దీంతో వాణిజ్య వాహనాల విభాగం కేవలం ప్రయోగాత్మక దశ నుంచి మరింత వ్యవస్థీకృత మార్కెట్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులకు రూ.2,000 కోట్లు

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలంటే ఛార్జింగ్ మౌలిక వసతులు కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందాలి.

అందుకే PM E-DRIVE పథకంలో పబ్లిక్ EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.2,000 కోట్లు కేటాయించారు.

ఇప్పటివరకు 7,254 ఛార్జర్ల కోసం రూ.729.34 కోట్ల విలువైన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటిని వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వ రంగ చమురు సంస్థల ద్వారా ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో 1,571 ఛార్జర్లు, ఢిల్లీలో 1,146, రాజస్థాన్‌లో 805 ఛార్జర్లకు ఆమోదం లభించింది.

HPCL, BPCL, IOCL వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఈ ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటులో భాగస్వాములుగా ఉన్నాయి.

వివరాలు

ఈవీ టెస్టింగ్ మౌలిక వసతులకు భారీ అప్‌గ్రేడ్

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలతో పాటు వాటి టెస్టింగ్, సర్టిఫికేషన్ సామర్థ్యాలను పెంచడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఈ విభాగం కోసం రూ.776.29 కోట్లు ఆమోదించారు. ఈ నిధులతో ARAI పుణె, ICAT మనేసర్, GARC చెన్నై, NATRAX ఇండోర్ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయనున్నారు.

ఈ అప్‌గ్రేడ్లలో ఫోర్-వీలర్ ఛాసిస్ డైనమోమీటర్లు, బ్యాటరీ సెల్ సైక్లర్లు, యాక్సిలరేటెడ్ లైఫ్ ఎవాల్యుయేషన్, EMI/EMC టెస్టింగ్ ల్యాబొరేటరీలు వంటి సామర్థ్యాలను అభివృద్ధి చేయనున్నారు.

వివరాలు

విస్తరిస్తున్న ఈవీ ఎకోసిస్టమ్

PM E-DRIVE పథకాన్ని తొలుత రూ.10,900 కోట్ల వ్యయంతో ఆమోదించారు. అనంతరం దీనిని విస్తరించి, పొడిగించారు.

ప్రస్తుతం పథకం నిర్మాణంలో రూ.11,900 కోట్ల మొత్తం కేటాయింపు ఉంది.

ఈ పథకం కేవలం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై డిమాండ్ ఇన్సెంటివ్‌లకే పరిమితం కాకుండా.. ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు, అంబులెన్సులు, ఛార్జింగ్ మౌలిక వసతులు, టెస్టింగ్ సదుపాయాలకు కూడా మద్దతు అందిస్తోంది.

ICAT@20 కార్యక్రమంలో వెల్లడైన గణాంకాలను పరిశీలిస్తే.. భారత్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇప్పుడు కేవలం ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు ఖర్చును తగ్గించే స్థాయిని దాటి ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

వివరాలు

టెస్టింగ్ సామర్థ్యాల్లో పెట్టుబడులు పెరిగాయి

అధిక సంఖ్యలో విక్రయాలు జరిగే విభాగాల్లో ఈవీ వినియోగం పెరగడం, భారీ స్థాయిలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణా వాహనాల కొనుగోలు, ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల ఆవిర్భావం, ఛార్జింగ్ మౌలిక వసతుల విస్తరణ, టెస్టింగ్ సామర్థ్యాల్లో పెట్టుబడులు పెరగడం వంటి అంశాలు దీనిని సూచిస్తున్నాయి.

భారత ఆటోమొబైల్ పరిశ్రమకు ఇకపై ఎలక్ట్రిక్ మొబిలిటీ వచ్చిందా లేదా అనే దానికంటే.. దానికి అనుగుణంగా తయారీ, ఛార్జింగ్, టెస్టింగ్, ఫైనాన్సింగ్, ఫ్లీట్ డిప్లాయ్‌మెంట్ వంటి మొత్తం ఎకోసిస్టమ్‌ను డిమాండ్‌కు అనుగుణంగా ఎంత వేగంగా విస్తరించగలదన్నది తదుపరి దశలో కీలకంగా మారనుంది.

ADVERTISEMENT