FASTag annual Pass: ఫాస్టాగ్ యూజర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి వార్షిక పాస్ ధరల పెంపు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు కీలక సమాచారం. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఫాస్టాగ్ వార్షిక ఫీజు ఎంత పెరిగింది? ఇప్పటివరకు రూ.3,000గా ఉన్న ఫాస్టాగ్ వార్షిక పాస్ ఫీజును రూ.3,075కు పెంచుతూ NHAI నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల రుసుము (రేట్ల నిర్ధారణ మరియు వసూలు) రూల్స్, 2008 ప్రకారం ఈ సవరణలు చేపట్టినట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 56 లక్షలకుపైగా ఫాస్టాగ్ యూజర్లు ఉన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ వాహన యజమానులలో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ వినియోగం ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది.
వివరాలు
ఎవరికి వర్తిస్తాయి కొత్త రేట్లు?
దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు మీద సుమారు 1,150 టోల్ ప్లాజాల్లో ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉన్న నాన్-కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకున్నవారు ప్రతీసారి టోల్ వద్ద చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి ఫీజు చెల్లిస్తే సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్స్ వరకు (ఏది ముందైతే అది) ప్రయాణించవచ్చు.
వివరాలు
ఎలా తీసుకోవాలి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్?
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను సులభంగా పొందేందుకు డిజిటల్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రాజ్‌మార్గ యాత్ర యాప్ లేదా NHAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఒకేసారి ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. చెల్లింపు పూర్తయ్యాక, వాహనానికి లింక్ అయిన ఫాస్టాగ్‌పై ఈ పాస్ రెండు గంటల్లో యాక్టివేట్ అవుతుంది.
వివరాలు
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అంటే ఏమిటి?
ఫాస్టాగ్ వార్షిక పాస్ అనేది ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సౌకర్యం. దీని ద్వారా నేషనల్ హైవేలు (NH), ఎక్స్‌ప్రెస్‌వేలు (NE)పై టోల్ ప్లాజాలను ఆగకుండా సులభంగా దాటవచ్చు. రూ.3,075 చెల్లించి ఈ పాస్ తీసుకుంటే, సంవత్సరం పాటు లేదా 200 ట్రిప్స్ వరకు టోల్ ఫీజు లేకుండా ప్రయాణం చేయవచ్చు. దేశవ్యాప్తంగా సుమారు 1,150 టోల్ ప్లాజాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది.
వివరాలు
యూజర్ల స్పందన ఎలా ఉంది?
ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను 2025 ఆగస్టు 15న ప్రారంభించారు. ప్రారంభం నుంచే దీనికి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికే 50 లక్షలకు పైగా యూజర్లు ఈ పాస్‌ను ఉపయోగిస్తున్నారు. టోల్ ఫీజు భారాన్ని తగ్గించేందుకు NHAI తీసుకున్న ఈ నిర్ణయం వాహనదారులకు ఉపశమనం కలిగిస్తోంది.