Ola: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు.. వివరణ ఇచ్చిన సంస్థ!
రెండ్రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్న ఘటన పూణేలో చోటు చేసుకుంది. పూణేలోని పింప్రి-చించ్‌వాడ్ ప్రాంతంలో ఈనెల 28న ఈ ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం కూడా పలు ఓలా స్కూటర్లలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత బ్యాటరీల విషయంలో ఓలా ప్రమాణాలను పెంచడంతో పెద్దగా ప్రమాదాలు చోటు చేసుకోలేదు. పూణేలోని డీవై పాటిల్ కాలేజ్ ఆవరణంలో ఓలా స్కూటర్ పార్క్ చేసి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఈ విషయంపై ఓలా ఎలక్ట్రిక్ సంస్థ వివరణ ఇచ్చింది.
అసలైన విడిభాగాలను మాత్రమే ఉపయోగించుకోవాలి
పూణేలో ఓలా స్కూటర్ ప్రమాదానికి గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని, కస్టమర్‌కు ఎలాంటి హానీ జరగలేదని, ఈ ఘటనపై తాము దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. బయట కొనుగోలు చేసిన విడిభాగాలను వాడడం వల్ల, షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు తమ విచారణలో తేలిందని, అయితే వాహనంలో బ్యాటరీ బాగానే పనిచేస్తున్నట్టు తెలిసిందన్నారు. తాము చాలా కఠినమైన భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటిస్తామని, కనుక కస్టమర్లు ఓలాకు సంబంధించి అసలైన విడిభాగాలనే ఉపయోగించుకోవాలని ఓలా ఓ ప్రకటనలో కోరింది.