LOADING...
Hyderabad: హైదరాబాద్‌లో పార్కింగ్ సమస్యకు జీహెచ్‌ఎంసీ స్మార్ట్ పరిష్కారం
హైదరాబాద్‌లో పార్కింగ్ సమస్యకు జీహెచ్‌ఎంసీ స్మార్ట్ పరిష్కారం

Hyderabad: హైదరాబాద్‌లో పార్కింగ్ సమస్యకు జీహెచ్‌ఎంసీ స్మార్ట్ పరిష్కారం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2026
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్‌ఎంసీ ఒక శుభవార్త అందించింది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఆధునిక సాంకేతికతతో కూడిన కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ క్రమంలోనే 'స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్' అనే వినూత్న ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 'మైజీహెచ్‌ఎంసీ' మొబైల్ యాప్‌లో ప్రత్యేక లింక్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ లింక్ ద్వారా నగరంలో స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఈ విధానాన్ని అమలు చేసే బాధ్యతను చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ టెండర్లను ఆహ్వానించగా, అర్హత సాధించిన రెండు సంస్థలను ఎంపిక చేసింది. ఆ సంస్థల సహకారంతో వాహనదారులకు స్మార్ట్ పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు.

వివరాలు 

స్మార్ట్ పార్కింగ్ విధానం ఎలా పనిచేస్తుంది?

దీని అమలుతో నగరంలో పార్కింగ్ సమస్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సరైన పార్కింగ్ స్థలాలు లేక వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్మార్ట్ పార్కింగ్ విధానం ద్వారా ఈ సమస్యకు కొంతమేరైనా పరిష్కారం లభించనుంది. మొదటి దశలో ఖైరతాబాద్ జోన్‌లో ఈ విధానాన్ని అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 14 ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ స్లాట్లకు మార్కింగ్ లైన్లు వేస్తారు. వాటి సమీపంలో సెన్సార్లను ఏర్పాటు చేస్తారు.

వివరాలు 

పార్కింగ్ ఫీజు చెల్లించి ముందుగానే స్లాట్‌ను బుక్ చేసుకునే అవకాశం

ఈ సెన్సార్లు ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్న పార్కింగ్ స్లాట్ల వివరాలను నమోదు చేస్తాయి. ఆ సమాచారం నేరుగా మైజీహెచ్‌ఎంసీ యాప్‌తో అనుసంధానమవుతుంది. వాహనదారులు యాప్ ద్వారా తమ ప్రస్తుత స్థానం నుంచి 500 మీటర్ల పరిధిలో ఎక్కడెక్కడ ఖాళీ పార్కింగ్ స్థలాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. కావాలనుకుంటే పార్కింగ్ ఫీజు చెల్లించి ముందుగానే స్లాట్‌ను బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. త్వరలోనే ఈ గుర్తించిన పార్కింగ్ ప్రదేశాల్లో అవసరమైన పనులను ప్రారంభించనున్నారు. భవిష్యత్తులో నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి స్మార్ట్ పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. దీని ద్వారా నగరంలోని పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

వివరాలు 

ప్రస్తుతం స్మార్ట్ పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్న ప్రాంతాలు

సోమాజిగూడలోని సీఎంఆర్ జ్యువెలరీ సమీపం,షేక్‌పేట్ పైవంతెన,సత్యం థియేటర్,మల్లేపల్లి వార్డు కార్యాలయం,నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్, సోమాజిగూడ ది పార్క్ హోటల్, స్టేట్ లైబ్రరీ ఎదురు భాగం, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, హిమాయత్‌నగర్, టీటీడీ ఆలయం, లిబర్టీ చౌరస్తాలోని వన్‌ప్లస్ స్టోర్, అబిడ్స్‌లోని చర్మాస్ షోరూమ్, అబిడ్స్ బ్లూ స్టోర్ రెస్టారెంట్, తాజ్‌మహల్ హోటల్, మెహిదీపట్నంలోని పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే కింది భాగం, బషీర్‌బాగ్ పైవంతెన నుంచి లిబర్టీ వరకు ఉన్న ప్రాంతాల్లో ఈ స్మార్ట్ పార్కింగ్ ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రస్తుతం దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తుండగా, రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలకు ఈ విధానాన్ని విస్తరించనున్నారు. దీంతో యాప్ సాయంతో వాహనదారులు సులభంగా పార్కింగ్ బుక్ చేసుకునే అవకాశం లభించనుంది.

Advertisement