Nitin Gadkari : వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ ఛార్జీలపై భారీ ఉపశమనం..?
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా వాహనదారులందరికీ ఒకే విధమైన టోల్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలపై వాహనదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ప్రధాన జాతీయ రహదారులపై అధిక టోల్ వసూలు, తగిన రహదారి సేవల కొరత వంటి సమస్యల కారణంగా ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు.
టోల్ ఫీజులపై ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తనకు తెలుసని, దీనిపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని గడ్కరీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Details
త్వరలోనే కొత్త విధానం
త్వరలోనే ప్రయాణికులకు ఉపశమనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
కొత్త టోల్ విధానానికి సంబంధించిన పరిశోధన ఇప్పటికే పూర్తయిందని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. టోల్ ఫీజులపై అనేక మీమ్‌లు వస్తున్నాయని, ప్రజలు కూడా కొంత కోపంగా ఉన్నారన్నారు.
అయితే ఈ కోపం మరికొన్ని రోజుల్లో తగ్గిపోతుందని గడ్కరీ వ్యాఖ్యానించారు. అయితే టోల్ వసూళ్లు పూర్తిగా రద్దవుతాయా లేదా టోల్ చార్జీలను తగ్గిస్తారా అనే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
అయినా కేంద్రం తీసుకోనున్న నిర్ణయంతో వాహనదారులకు ఊరట లభిస్తుందని మాత్రం గడ్కరీ స్పష్టం చేశారు.