Hero MotoCorp: మూడు మోడళ్లకు గుడ్‌బై.. హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం
ప్రముఖ ఆటో మొబైల్ తయారీదారు హీరో మోటోకార్ప్ మూడు మోటార్ సైకిళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. 200సీసీ కేటగిరీలో ఎక్స్‌ట్రీమ్ 200S 4v, హీరో ఎక్స్‌పల్స్ 200T మోడళ్లతో పాటు, కమ్యూటర్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్యాషన్ ఎక్స్‌టెక్ బైక్‌ను కూడా గుడ్‌బై చెప్పింది. మెరుగైన విక్రయాలు లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఆయా మోడళ్లను తొలగించింది. హీరో మోటోకార్ప్ 200సీసీ సెగ్మెంట్‌లో ఎక్స్‌పల్స్ 200 4v, ఎక్స్‌పల్స్ 200T, ఎక్స్‌ట్రీమ్ 200S 4v బైక్స్‌ను విక్రయించింది. అయితే, తాజాగా ఎక్స్‌పల్స్ 200 4v మినహా మిగిలిన రెండు మోడళ్ల ఉత్పత్తి నిలిపివేసింది.
కొత్త మోడల్స్ కోసం ప్రణాళికలు
ఎక్స్‌పల్స్ 200 4v కూడా త్వరలోనే ఉత్పత్తి నుంచి నిలిచిపోవచ్చని, దాని స్థానంలో 210సీసీ నూతన ఎక్స్‌పల్స్ మోడల్‌ను పరిచయం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కమ్యూటర్ సెగ్మెంట్‌లో ఒకప్పుడు స్ప్లెండర్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ప్యాషన్ ఎక్స్‌టెక్ ఉత్పత్తిని కూడా హీరో నిలిపివేసింది. 113సీసీ ఇంజిన్, 4-స్పీడ్ గేర్‌బాక్స్‌లు కలిగిన ఈ బైక్‌ను డ్రమ్, డిస్క్ వేరియంట్లలో విక్రయించారు. బడ్జెట్ ఫ్రెండ్లీ మోటార్ సైకిల్‌గా పేరుపొందినా, విక్రయాల్లో మందగమనం కారణంగా దీనికి కూడా వీడ్కోలు పలికింది. హీరో మోటోకార్ప్ తాజా నిర్ణయంతో ప్యాషన్ బ్రాండ్ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది. మరోవైపు 200సీసీ సెగ్మెంట్‌లో కొత్త ఎక్స్‌పల్స్ మోడళ్లతో మార్కెట్‌ను ఆకట్టుకోవాలని కంపెనీ ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.