LOADING...
E20 Petrol With RON 95: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ తప్పనిసరి.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు
E20 Petrol: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ తప్పనిసరి..2026 ఏప్రిల్ 1 నుంచి అమలు

E20 Petrol With RON 95: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ తప్పనిసరి.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా పెట్రోల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1, 2026 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో E20 పెట్రోల్ తప్పనిసరిగా అమ్మాలని ఆదేశాలు జారీ చేసింది. అంటే పెట్రోల్‌లో గరిష్టంగా 20 శాతం ఎథనాల్ కలిపి, కనీసం RON 95 ప్రమాణాలతో సరఫరా చేయాలి. ఫిబ్రవరి 17న పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేస్తూ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనల ప్రకారం ఆయిల్ కంపెనీలు ఈ పెట్రోల్‌ను సరఫరా చేయాలని స్పష్టం చేసింది. క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గించడం, కాలుష్యాన్ని కట్టడి చేయడం, రైతులకు ఆదాయం పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

వివరాలు 

ఎథనాల్ వల్ల రైతులకు అదనపు డిమాండ్

చెరకు, మొక్కజొన్న వంటి పంటలతో తయారయ్యే ఎథనాల్ వల్ల రైతులకు అదనపు డిమాండ్ ఏర్పడుతుంది. ఇప్పటికే 2022 జూన్‌లోనే 10 శాతం ఎథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని భారత్ ముందుగానే సాధించింది. ఇప్పుడు 20 శాతం లక్ష్యాన్ని 2025-26 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో, ప్రత్యేక పరిస్థితుల్లో పరిమిత కాలానికి మినహాయింపులు ఇవ్వవచ్చని స్పష్టం చేసింది. వాహనాల విషయానికి వస్తే 2023 నుంచి 2025 మధ్య తయారైన ఎక్కువ కార్లు E20 పెట్రోల్‌కు అనుకూలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పాత వాహనాల్లో 3 నుంచి 7 శాతం వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉందని, కొన్ని రబ్బరు, ప్లాస్టిక్ భాగాలు త్వరగా దెబ్బతినే అవకాశముందని వినియోగదారులు చెబుతున్నారు.

వివరాలు 

RON 95 ప్రమాణం వల్ల ఇంజిన్ నాకింగ్ సమస్య తగ్గి, పనితీరు మెరుగ్గా

RON అంటే రీసెర్చ్ ఆక్టేన్ నంబర్. ఇంధనం ఇంజిన్‌లో సరిగా కాలుతుందా లేదా అన్నది ఇది సూచిస్తుంది. RON 95 ప్రమాణం వల్ల ఇంజిన్ నాకింగ్ సమస్య తగ్గి, పనితీరు మెరుగ్గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎథనాల్ సహజంగానే ఎక్కువ ఆక్టేన్ విలువ (సుమారు 108) కలిగి ఉండటంతో పెట్రోల్ నాణ్యత మెరుగవుతుందని పేర్కొన్నారు. 2014-15 నుంచి ఎథనాల్ మిశ్రమంతో భారత్‌కు రూ.1.40 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్య ఆదా జరిగిందని ఆయిల్ మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త నిర్ణయంతో దేశ ఇంధన భద్రత మరింత బలపడడంతో పాటు, కాలుష్యం తగ్గి, సస్టైనబుల్ మొబిలిటీ దిశగా మరో ముందడుగు పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement